హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో సమ్మె హారన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు వెనుకాడేది లేదని ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ మేరకు ఇటీవల ఆర్టీసీ యాజమాన్యానికి, లేబర్ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చాయి. అయినప్పటికీ కార్మికులను చర్చలకు ఆహ్వానించకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్సారం చేస్తున్నది. దీంతో యూనియన్లు ఈ నెల 7న సమ్మెకు సంబంధిచిన సన్నాహక సమావేశం నిర్వహించనున్నాయి. ఈ లోగా ప్రభుత్వం స్పందించకపోతే అదేరోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న (ఈయూ), జేఏసీ వైస్ చైర్మన్ మారంరెడ్డి థామస్‌రెడ్డి (టీఎంయూ) ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలు, కారుణ్య నియామకాలపై యాజమాన్యం తప్పనిసరిగా చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
చర్చలకు యాజమాన్యం డుమ్మా
సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న సమ్మె నోటీసు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పం దన లేకపోవడం దారుణమని ఈయూ, టీఎంయూ నాయకులు తెలిపారు. ఇటీవల లేబర్ కమిషనర్ ఇరు వర్గాలను రెండుసార్లు చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం రాలేదని పేర్కొంటూ.. దీని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మూడోసారి నోటీసులు ఇచ్చేందుకు లేబర్ కమిషనర్ సుముఖత వ్యక్తం చేయడం లేదని, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతున్నారని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఎన్నికల సంఘం అధికారులను కలువగా ‘ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీసుకు, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని, నిరభ్యంతరంగా చర్చలు జరుపుకోవచ్చని స్పష్టం చేయడంతో 7న సన్నాహక సమావేశం నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం ఒకవేళ సమ్మె జరిగితే అందుకు పూర్తిగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని యూనియన్లతోపాటు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు కూడా కలిసిరావాలని కోరారు.
ఆర్టీసీ సిబ్బందిపై అధిక పనిభారం
ఆర్టీసీలో గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 16 వేల మంది కార్మికులు రిటైర్ అయినప్పటికీ కొత్త నియామకాలు చేపట్టలేదని, ఆ పని భారమంతా ప్రస్తుతం ఉన్న కార్మికులపైనే పడుతున్నదని ఈయూ, టీఎంయూ నాయకులు ధ్వజమెత్తారు. దీంతో రోజుకు 14 నుంచి 16 గంటలపాటు పనిచేయాల్సి వస్తున్నదని, అధిక పని భారాన్ని తట్టుకోలేక ఏటా సుమారు 200 మంది కార్మికులు అకాల మరణం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 వేతన సవరణకు సంబంధించిన అలవెన్సులను ఇప్పటివరకు పెంచలేదని, వాటిని ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు.
వేతన బకాయిలను లెక్కగట్టి, ఆ వివరాలను ప్రతి కార్మికునికి తెలియజేయాలని, గతంలో ఇచ్చినట్టు 5 ఏండ్ల కాలపరిమితికి వడ్డీతో సహా చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనప్పుడు వారితో సమానంగా హెచ్ఆర్ఏ ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వెంటనే అపాయింట్మెంట్ డేను ప్రకటించాలని, ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు.