రంగారెడ్డి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో (Rangareddy) రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లాను పూర్తిగా హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకున్నప్పటికీ నిర్మాణాల అనుమతి మాత్రం మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి రెసిడెన్షియల్ పేరుతో తీసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో జీ-ప్లస్ 4, గ్రామపంచాయతీల్లో జీ-ప్లస్ 2 నిర్మాణాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాని, ఐదు నుంచి ఆరు అంతస్తులు అదనంగా వేసి కమర్షియల్‌కు వాడుతున్నారు. ముఖ్యంగా జిల్లా పరిధిలో ఇంజినీరింగ్, పీజీ, డెంటల్, ఫార్మసీ, ఎంబీఏ వంటి కళాశాలలు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ కళాశాలల చుట్టూ విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నారు. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి వంటి మండలాల్లో అధిక సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి.
ఒక్క ఇబ్రహీంపట్నం మండలంలోనే 20 నుంచి 30 వరకు ఇంజినీరింగ్, పీజీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కళాశాలలున్నాయి. ఈ కళాశాలల చుట్టూ వందలాది హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. ఈ హాస్టళ్లన్నింటికీ రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని భవన నిర్మాణాలు చేపట్టి కమర్షియల్‌కు వాడుతున్నారు. కమర్షియల్ భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. కాని, హెచ్ఎండీఏ అనుమతులు కఠినతరంగా ఉండటంతో సెట్‌బ్యాక్ వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మరోవైపు కమర్షియల్ భవన నిర్మాణాలకు కూడా ఫీజు అధికంగా ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని అక్రమార్కులు రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకుంటున్నారు. కాని, ఈ భవనాల్లో హాస్టళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, గోడౌన్ల వంటి కమర్షియల్‌కు వినియోగిస్తున్నారు. రెసిడెన్షియల్ అనుమతుల భవనాల్లో కమర్షియల్ వాటికి ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. కాని, అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై కాసులకు కక్కుర్తిపడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు కమర్షియల్ భవనాల అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా వస్తుంది. కాని, అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 2వేలకు పైగా హాస్టళ్లు
రంగారెడ్డి జిల్లాలో సుమారు 2వేలకు పైగా ప్రైవేటు హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మంగల్‌పల్లి, ఆదిబట్ల, తుర్కయాంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, తుక్కుగూడ మున్సిపాలిటీలోని తుక్కుగూడ, మహేశ్వరం, రావిర్యాల వంటి పరిసర ప్రాంతాల్లో వేలాది హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల్లోనే కొనసాగుతుండటం విశేషం. కొంతమంది హాస్టల్ నిర్వాహకులు తెలివిగా ఈ భవనాలపై బోర్డును ఏర్పాటు చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్ భవనాలపై చర్యలు తీసుకోవల్సిన అధికారులు వారితో మిలాకత్ అవుతున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మొక్కుబడిగా రెసిడెన్షియల్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లపై అధికారులు దాడులు జరిపి కమర్షియల్ భవనాలుగా గుర్తించి లక్షల రూపాయల పన్నులు వేయగా.. ఆయా మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. కాని, మిగతా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మిస్తున్న హాస్టళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి.
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గోడౌన్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున గోడౌన్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. వీటికి హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. కాని, హెచ్ఎండీఏ నిబంధనలు కఠినతరంగా ఉండటంతో హెచ్ఎండీఏకు వెళ్లకుండానే అధికారులతో కుమ్మక్కై గోడౌన్లు, హోటళ్లు, ఇతర షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండీ పడుతున్నప్పటికీ సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లోని రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకుని ఆపైన అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల వద్దకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది వెళ్లి ఒకటి రెండు రోజులు పనులు ఆపేసి ఆ తర్వాత వారితో కుమ్మక్కవుతున్నారు. అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి తమ నిర్మాణాలు యథావిదిగా సాగిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.