ముథోల్, జూన్ 23 : నిర్మల్ జిల్లా బాసరలోని మహంకాళీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి అమ్మవారి అనుబంధ మహంకాళీ ఆలయం తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లి పరిసర ప్రాంత సమీపంలో పగులగొట్టి అందులో ఉన్న నగదు దోచుకెళ్లారు. కిరీటం బరువు కిలోకు పైగా ఉంటుందని ప్రాథమిక సమాచారం. మంగళవారం ఉదయం అభిషేక పూజకు వచ్చిన ఆలయ పూజారులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, సీఐ రవీందర్ నాయక్ ఘటనాస్థలానికి చేరుకొని ఆలయ ఈవో అంజనాదేవిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు క్లూస్ టీమ్, డాగ్స్కాడ్ ను రప్పించడంతోపాటు వేలి ముద్రలను సేకరించి ఆలయం దగ్గర ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డట్టు నిర్ధారించారు.