Musi River | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మూసీ వెంట పేదల ఆర్తనాదాలు ఒకవైపు కొనసాగుతుండగా, అధికారులు.. పేదల ఇండ్ల కూల్చివేతలను మరోవైపు కొనసాగిస్తున్నారు. హిమాయత్‌నగర్, సైదాబాద్ పరిధిలో మంగళవారం అధికారులు 150 ఇండ్లను నేలమట్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో మరో 940 ఇండ్లకు రెడ్‌మార్క్ కత్తి వేలాడుతున్నది. కూల్చేసిన ఆ 150 ఇండ్ల శిథిలాల తరలింపునకు అధికారులు జేసీబీలను రంగంలోకి దించుతున్నారు. హిమాయత్‌నగర్, సైదాబాద్‌లో కూల్చేసిన ఆ నిర్మాణాల వరకు జేసీబీలు వెళ్లే రోడ్లు లేవు. ఇరుకు రోడ్లతో ఆయా ప్రాంతాలు ముడిపడి ఉన్నాయి.
రెడ్‌మార్క్ నిరాకరించిన ఇండ్లను సైతం కూలగొట్టినా జేసీబీలు అక్కడి వరకు వెళ్లలేని పరిస్థితి ఉన్నది. ఈ దశలో శిథిలాల తరలింపునకు జేసీబీలు మూసీలోకి ఎంట్రీ ఇస్తే నిర్వాసితులు అడ్డుకుంటారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. దీంతో అధికారులు రహస్య దారులను పరిశీలిస్తున్నారు. అందుకోసం మూడు మార్గాలను ఎంచుకున్నట్టు తెలిసింది. ఇమ్లీబన్ బస్టాండ్ నుంచి అర కిలోమీటర్ మూసీ మార్గాన్ని అధికారులు పరిశీలించినట్టు తెలిసింది.
పురానాపూల్ నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరంతో మూసీ వెంట దారిని కూడా పరిశీలించినట్టు తెలిసింది. ఇంకోవైపు ముసారంబాగ్ నుంచి అంబర్పేట్ బ్రిడ్జి మీదుగా ఆ ప్రాంతాలకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. జేసీబీలు శిథిలాల తరలింపుతోపాటు రెడ్‌మార్క్ చేసిన ఇతర నిర్మాణాలనూ కూల్చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. అయితే అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆయన సెలవిచ్చారు.