నాగర్కర్నూల్ రూరల్, అక్టోబర్ 12 : ప్రియుడి మోజులో పడి ఓ భార్య భర్తను హత్య చేయించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా శ్రీపురంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన రాముడు(37)కి వెన్నచెర్లకు చెందిన మానసతో 13 ఏండ్ల కిందట వివాహనం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మానస కొంత కాలంగా పెద్దముద్దనూరుకు చెందిన సురేశ్గౌడ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. తమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని హత్యకు ప్లాన్ చేశారు.
రాముడు శుక్రవారం గుడిపల్లిలో బంధువుల వివాహానికి వెళ్లి శనివారం అర్ధరాత్రి తిరిగి వస్తుండగా గుడిపిల్ల శివారులోని క్రషర్ మిషన్ దగ్గర హత్యకు గురయ్యాడు. స్థానికులు రాముడు తండ్రి పాండయ్యకు సమాచారం ఇవ్వడంతో ఆయన తన కోడలి వివాహేతర సంబంధం గురించి పోలీసులకు తెలియజేశారు. వారు ఆమెను భర్త హత్యపై నిలదీయగా తానే భర్తను హత్య చేయించినట్టు అంగీకరించినట్టు ఎస్సై గోవర్ధన్ వెల్లడించారు. పాండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.