SLBC Tunnel Incident | నాగర్కర్నూల్, మార్చి 2: ఎల్ఎల్బీసీ టన్నెల్లో నీటి ఊట ఆగడమే లేదు. హెవీ మోటర్లతో తోడిపోస్తున్నా నిరంతరంగా నీరు ఊరుతూనే ఉన్నది. ఫలితంగా రెస్క్యూ బృందాల సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. టన్నెల్లో 8 మంది గల్లంతైన ఘటన జరిగి నేటికీ తొమ్మిది రోజులు అవుతున్నది. టన్నెల్లో కూలిన మట్టి శిథిలాల్లోనే మృతదేహాలు ఉన్నట్టు గుర్తించి నాలుగు రోజులవుతున్నది. నీటి ప్రవాహం వల్ల ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యంకావడం లేదు. ఈ నేపథ్యంలో జియోలాజికల్ అధికారులు రంగంలోకి దిగారు. నీరు వస్తున్న ప్రాంతా న్ని గుర్తించే పనిలోపడ్డారు.
ప్రమాదం స్థలంలో పైభాగమైన అమ్రాబాద్ అటవీప్రాంతంలోని మల్లెలతీర్థం, తిర్మలాపూర్ సమీపం నుంచి ఈ నీటి ఊట వస్తుందని అధికారులు గుర్తించారు. ముందుగా ఆ నీటి ఊటకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు. కృష్ణానది వైపుగా పెద్దమొత్తంలో వస్తున్న నీటి ప్రవాహం టన్నెల్లోకి పారుతుందని గుర్తించారు. ఈ నీటి ప్రవాహం ఎల్ఎల్బీసీ సొరంగం వైపు మళ్లడంతో టన్నెల్లో నీటి ప్రవాహం పెరిగి రెస్క్యూ టీమ్ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తున్నది.