శంకర్పల్లి/రాయికోడ్, డిసెంబర్ 14: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ (Sarpanch Elections) కాంగ్రెస్ (Congress) మద్దతుదారుగా రాజు నామినేషన్ దాఖలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో పాటు కాంగ్రెస్ నుంచి మద్దతు లేకపోవడం, నమ్మిన వాళ్లు మోసం చేశారని మనస్తాపం చెంది ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు అయ్యప్పమాలలో ఉండి మృతిచెందడం గ్రామస్తులను కలిచివేసింది. పిపిడ్పల్లి గ్రామ పంచాయతీ స్థానానికి ఆదివారం పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి నారాయణకు 690 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు చాల్కి రాజుకు 699 ఓట్లు వచ్చాయి. 9 ఓట్ల తేడాతో చాల్కి రాజు సర్పంచ్‌గా గెలిచాడు. బీజేపీ అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి. 32 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. 4 ఓట్లు నోటాకు వచ్చాయి.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడెం గ్రామ పంచాయతీ నుంచి 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన పల్లె లత ఈ నెల 7న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. రెండో విడత ఎన్నికల్లో ప్రత్యర్థి పల్లె అనితపై.. పల్లె లత 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. చనిపోయిన అభ్యర్థి గెలవడంతో ఆ వార్డుకు రీ ఎలక్షన్ నిర్వహిస్తామని ఎంపీడీవో వెంకయ్యగౌడ్ తెలిపారు.