హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనున్నది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. తొలుత నిజామాబాద్, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికానున్నాయి. మిగిలిన ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోగా వెల్లడయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను 34 కౌంటింగ్ కేంద్రాల్లో 2,131 టెబుళ్లపై లెక్కించనున్నారు. వాటిలో ఈవీఎం ఓట్లను లెక్కించేందుకు 1,855 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి వేర్వేరు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 10 వేల సిబ్బందిని నియమించారు.
సర్వీసు ఓట్లను స్కాన్ చేసేందుకు 135 స్కానర్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు సూపర్వైజర్ల సమక్షంలో ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 12 కంపెనీల కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు అడుగడుగునా సీసీ కెమెరాలను నెలకొల్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 49 మంది పరిశీలకులను నియమించింది. ఎన్నికల ఫలితాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తికానుండగా.. వరంగల్ సెగ్మెంట్ ఓట్లను 18 రౌండ్లపాటు, సికింద్రాబాద్ నియోజకవర్గ ఓట్లను 20 రౌండ్లపాటు లెక్కించనున్నారు. మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 21 రౌండ్లలో పూర్తి కానున్నది. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. అదనంగా 20 శాతం సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్లలోని స్లిప్పులను ర్యాండమ్‌గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపునకు 700 కంప్యూటర్లు, 800 ఐటీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.