వేములవాడ, నవంబర్ 24 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నది. వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. వేములవాడకు చెందిన మహిళా రైతు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తి విక్రయించగా ఆమెకు చెందిన నగదు రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
వేములవాడకు చెందిన ఏదుల సత్తమ్మ ఈ నెల 6న నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించింది. సదరు రైతుకు సంబంధించిన రూ.2 లక్షల 14 వేల 549 సీసీఐ ద్వారా ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో జమయినట్టు 14వ తేదీన రైతు సెల్ ఫోన్‌కు సందేశం వచ్చింది.
నగదును డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లిన రైతుకు బ్యాంకు ఖాతాలో నగదు పడలేదని ఎస్బీఐ అధికారులు చెప్పారు. దీంతో సీసీఐ అధికారులను సంప్రదించగా నగదు రాజన్న ఆలయ ఖజానాలో జమయినట్టు గుర్తించారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల నగదు వ్యవహారం కొనసాగుతున్న ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఏ మేరకు భద్రమని ప్రశ్నిస్తున్నారు.
సామాన్య మహిళా రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్‌కు బ్యాంకు ఖాతా ఎందుకు లింక్ అయి ఉన్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలపై సదరు అధికారులు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.