హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగనున్నాయి. మొదటి మూడు రోజులకు ఆన్లైన్లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్ల కేటాయింపు పూర్తయింది. మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
డిసెంబర్ 31వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. పది రోజులపాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆన్లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేయగా, ప్రతి రోజు 60 వేల టోకెన్ల చొప్పున దర్శనాలు కేటాయించినట్టు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూలైన్ నిర్వహణ, నిఘా చర్యలు ముందస్తుగా అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.