కన్నడ అగ్ర నటులు శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘45 ది మూవీ’. ఈ చిత్రానికి కథ, సంగీతం, దర్శకత్వం అర్జున్ జన్య. ఉమా రమేష్‌రెడ్డి, ఎం.రమేష్‌రెడ్డి నిర్మాతలు. జనవరి 1న చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘కన్నడంలో ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా చూస్తే, ప్రతి ఒక్క ప్రాణినీ ప్రేమిస్తారు.. గౌరవిస్తారు.
ఈ భూమ్మీద ఎన్నాళ్లుంటామో తెలీదు.. ఉన్నని రోజులూ సంతోషంగా బతకాలని చెప్పే మూవీ ఇది.’ అన్నారు. మునుపెన్నడూ చూడని కొత్త శివన్నను ఇందులో చూస్తారని, ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ఇందులో చేశానని, పైకి సౌమ్యంగా కనిపించే దర్శకుడు అర్జున్ తెరపై మాత్రం విధ్వంసం సృష్టించారని ఉపేంద్ర పేర్కొన్నారు. ‘45’ మూవీలో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారని దర్శకుడు అర్జున్ జన్య తెలిపారు. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమా విడుదల చేస్తున్నందుకు నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు. మైత్రీ శశి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.