అతి పిన్న వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరాం బోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఖుదీరాం బోస్’. ‘ది ఫస్ట్ యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్’ అనేది ఉపశీర్షిక. రాకేష్ జాగర్లమూడి టైటిల్‌రోల్ పోషించారు. డీవీఎస్ రాజు దర్శకుడు. రజితా విజయ్ జాగర్లమూడి నిర్మాత. ఈ చిత్రం కేంద్ర ప్రభుత్వ అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘Waves’లో అందుబాటులో ఉన్నది.
ఈ సినిమా గురించి హీరో రాకేష్ జాగర్లమూడి మాట్లాడుతూ ‘18ఏండ్ల వయసులో దేశం కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కడం సాధారణమైన విషయం కాదు. అలాంటి గొప్ప వీరుడి పాత్రను చేయడం గర్వంగా ఉంది. మానాన్నగారే ఈ చిత్రానికి నిర్మాత. ఆయనలోని దేశభక్తే ఈ సినిమా నిర్మాణానికి పురిగొల్పింది.
ఈ పాత్రకోసం 90రోజులు కఠిన శిక్షణ తీసుకున్నాను. వందేమాతరం నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వీరుడు ఖుదీరాంబోస్. అలాగే స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదితతో ఆయనకున్న అనుబంధం, ఆమె తయారు చేసిన తొలి జాతీయ జెండాను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇవన్నీ ఇందులో ఆసక్తిగొలిపే అంశాలు.
తోట తరణి, మణిశర్మ, రసూల్ ఎల్లోర్ వంటి దిగ్గజాలు ఈ సినిమాకు పనిచేశారు. అతుల్ కులకర్ణి, వివేక్ ఓబెరాయ్, నాజర్ వంటి గొప్ప నటులతో పనిచేసే అవకాశం ఈ సినిమా ఇచ్చింది. పార్లమెంట్‌లోనూ, గోవా ఫిల్మ్ ఫెస్టివల్లోనూ స్క్రీనింగ్ వేశాం. అంతా స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందించారు.’ అంటూ చెప్పుకొచ్చారు.