హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరాన్ని కాంగ్రెస్ సర్కార్ అశాస్త్రీయంగా మూడు ముక్కలు చేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ కేపీ వివేకానంద మండిపడ్డారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో గురువారం ఆయన మాట్లాడారు. రహస్యంగా డీలిమిటేషన్ నిర్వహించి, నెలలోగా జీవోలు జారీ చేసి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విభజించిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలు తీసుకోకుండా నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేయడం దుర్మార్గమని మండిప్డడారు. 2007లో 625 చ.కిలోమీటర్లు కలిగిన జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత ప్రజలు నరకయాతన పడ్డారని, పదిహేను రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రెండేండ్లలో సుమారు రూ. 2వేల కోట్లు వెచ్చించి పరిస్థితులను చక్కదిద్దారని పేర్కొన్నారు. నాడు ప్రజలను ఒప్పించి 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీపై రెండుసార్లు బీఆర్ఎస్ జెండా ఎగిరిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కార్ జీహెచ్ఎంసీలో మళ్లీ కేంద్రీకృత పాలన తెచ్చేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. సర్కార్ నిర్ణయం ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
మూసీ ముసుగులో డ్రామాలు..
కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొంటున్న మూసీ సుందరీకరణ విషయంలో సర్కార్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఎమ్మెల్యే వివేకానంద ఎద్దేవాచేశారు. సుంకిశాల కుప్పకూలి ఏడాదిన్నర దాటినా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు చేపట్టిన మేఘా ప్రాజెక్టును ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదని? నగదు ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు.
హైడ్రా కమిషనర్వి ఒంటెద్దు పొకడలు
హైడ్రా ముసుగులో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి పాల్పడుతున్నదని ఎమ్మెల్యే వివేకానంద తూర్పారబట్టారు. హైడ్రా కమిషనర్ తనకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయని ఒంటెద్దుపోకడ పోతున్నారని మండిపడ్డారు. 1045 ఎకరాలను హైడ్రా రికవరీ చేసిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పేదల గుడిసెలను కూలగొట్టి ఫెన్సింగ్ వేసి భూములను కాపాడామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. హైడ్రాకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజల రెఫరెండం లభించిందని రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దమ్ముంటే హైడ్రా కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఖద్దర్ డ్రెస్ వేసుకొని రాజకీయాల్లోకి రావాలని సవాల్ విసిరారు.
ఫ్యూచర్‌సిటీ ముసుగులో రియల్ దందా..
ఫ్యూచర్‌సిటీ, ఫోర్త్‌సిటీని నిర్మిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఊహాల్లో తేలుతున్నారని ఎద్దేవాచేశారు. 30 వేల ఎకరాలు అవసరమని చెబుతున్న ఆయన ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు సేకరించారని ప్రశ్నించారు. కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలు తప్ప ఇప్పటివరకు ఎకరా కూడా రేవంత్ సర్కార్ సేకరించలేదని విమర్శించారు. ఫ్యూచర్‌సిటీ ముసుగులో రియల్ఎస్టేట్ దందా నడిపేందుకు ఎత్తులు వేస్తున్నారని దుయ్యబట్టారు.