హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మించిన యూఏఈ దౌత్య కార్యాలయం జూన్ 14న ప్రారంభం కానున్నది. దీనిని యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సయేఖ్ ప్రారంభిస్తారని కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్నాయిమీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌తో తమకు ఉన్న స్నేహపూర్వక వ్యాపార సంబంధాల దృష్ట్యా ఇక్కడ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. యూఏఈకి దేశంలో ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలో కాన్సులేట్ కార్యాలయాలుండగా, హైదరాబాద్ కార్యాలయం నాలుగోది. తెలంగాణవాసులకు ఇకపై వీసాల కోసం ఎదురుచూపులు, దూర ప్రయాణాల అవసరం ఉండదు. ఇప్పటికే కొత్త కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏప్రిల్ నుంచి పరిమితంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నది.
ప్రస్తుతం రోజుకు 200 వీసా అప్లికేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 500కు, డిమాండ్‌ను బట్టి 800 వరకు పరిశీలిస్తామని ఆరెఫ్ తెలిపారు. వీసాదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2016లో భారత్ పర్యటనకు వచ్చిన యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి, అబుదాబీ రాజు సొదరుడైన షేఖ్ అబ్దుల్లా జయాద్ను హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ కోరారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న యూఏఈ ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. యూఏఈకి భారత్‌తో వ్యాపార, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లుగా ఉన్నది.