హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీచేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ విమర్శించారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ కోశాధికారి పీ యోగానంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాసర్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతీసాగర్ మాట్లాడుతూ.. ఈ జీవో జర్నలిస్టుల కనీస హకు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా, జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి సీఎం కేసీఆర్ సూచనల మేరకు అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 23 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీచేశారని వివరించారు.
ప్రధానంగా డెస్ జర్నలిస్టులను కూడా గుర్తించి ఒకే గొడుగు కిందికి తెచ్చి అందరికీ కార్డులు ఇచ్చారని తెలిపారు. కానీ, 40 ఏండ్ల నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ రెండు రాష్ట్రాల్లో ఉండే ఒక సంఘం అప్పట్లో దీనిని వ్యతిరేకించిందని గుర్తుచేశారు. నేడు కూడా ఆ యూనియన్‌కు చెందిన జాతీయ నాయకుడే మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉండటంతో ఇప్పుడు డెస్ జర్నలిస్టులను వేరు చేసి వాళ్ల పంతాన్ని నెగ్గించుకున్నారని ఆరోపించారు. మీడియా అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరిట రెండు కార్డులు తెచ్చి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో జీవోలో స్పష్టంచేయలేదని విమర్శించారు. జర్నలిస్టులు అందరికీ ఒకేరకమైన ప్రయోజనాలు ఉండాలని డిమాండ్ చేశారు.
కొత్తగా ఇవ్వబోయే కార్డుల్లో పదివేలకుపైగా కోత పెట్టే విధంగా నిబంధనలు రూపొందించారని మారుతీసాగర్ దుయ్యబట్టారు. ఈ నిబంధనలతో జర్నలిస్టులు తమ హకుగా పొందే అక్రెడిటేషన్ కార్డులను కోల్పోవడం అనివార్యమని పేర్కొన్నారు. రిపోర్టర్లు, డెస్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా ‘మీడియా కార్డు’ను తేవాలని యోచించడం శోచనీయమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-239 ప్రకారం అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేబుల్ చానెల్స్‌కు రాష్ట్ర స్థాయిలో 12, జిల్లా స్థాయిలో నాలుగు అక్రెడిటేషన్స్ ఇవ్వగా.. ప్రస్తుత చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి కేబుల్ చానల్స్‌పై కక్ష కట్టినట్టు రాష్ట్రస్థాయిలో ఒక కార్డు కూడా ఇవ్వకుండా జీవో తేవడం వెనుక మర్మం ఏమిటో అర్థం కావటం లేదని పేర్కొన్నారు.
మండల స్థాయిలో లక్ష జనాభాపైన ఉంటే గతంలో అదనంగా కార్డులు ఇచ్చేవారని, ప్రస్తుతం కేవలం మండలానికి ఒక కార్డు, నియోజకవర్గానికి అసలు కార్డులే లేకుండా ఎత్తివేయడంవల్ల పార్ట్‌టైం రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రికి ప్రస్తుతం మీడియా అకాడమీ చైర్మన్, ఆయన కొనసాగుతున్న సంఘం వారు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఇలాంటి జీవో వచ్చి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని మెజారిటీ జర్నలిస్టులు వ్యతిరేకించే ఈ జీవోను వెంటనే పునః పరిశీలించి అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్లు అందేలా జీవోను సవరించాలని డిమాండ్ చేశారు.
తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణకుమార్, కోశాధికారి యోగానంద్ మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ జర్నలిస్టుల కనీస అనుభవాన్ని పదేండ్ల నుంచి 15 ఏండ్లకు పెంచడం అన్యాయమని పేర్కొన్నారు. పెద్ద పత్రికలు, శాటిలైట్ చానల్స్‌కు సైతం భారీ స్థాయిలో కోత విధించారని, అనుభవంలోకి వస్తే కాని అందరికీ అర్థం కాని విధంగా ఈ జీవోను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఐజేయూ నాయకుడు భాసర్ మాట్లాడుతూ.. మీడియా అక్రెడిటేషన్ కమిటీలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ నవీన్‌కుమార్ యారా, జిల్లా అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి, జిల్లా కోశాధికారి బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో-252ను సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 అన్నీ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్టు నేతలు పిలుపునిచ్చారు. అప్పటిలోగా ప్రభుత్వం జీవోను సవరించాలని తాము కోరుకుంటున్నామని, ఒకవేళ తాత్సారం చేస్తే రాజ్యాంగం కల్పించిన హకుగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని స్పష్టంచేశారు.