హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)ల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని తగ్గించడానికి రవాణాశాఖ కొత్త విధానాన్ని తీసుకురానున్నది. మహారాష్ట్రలో అమలవుతున్న కేంద్రీకృత విధానాన్ని రాష్టంలోనూ ప్రవేశపెట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. దీని ద్వారా వాహనదారులకు త్వరగా కార్డులు అందుతాయి.
ప్రస్తుతమున్న విధానంతో కార్డుల జారీ చాలా ఆలస్యం కావడంతో వాహనదారుల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్ నేతృత్వంలో ఇటీవల ఒక బృందం మహారాష్ట్రకు వెళ్లి అక డ అమలవుతున్న విధానాన్ని ఇప్పటికే పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఆ నివేదికను తాజాగా ఆమోదించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 62 ఆర్టీవో కార్యాలయాలు ఉండగా.. ప్రతిరోజూ 9వేల నుంచి 12వేల వరకు ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతుంటాయి. అయితే అవి వాహనదారులకు సకాలంలో అందడం లేదు. కొన్నిసార్లు రెండు, మూడునెలలు సమయం కూడా పడుతున్నది. ఈ సమస్యను పరిష్కరించటానికే మహారాష్ట్రలో కేంద్రీకృత(సెంట్రలైజ్డ్) విధానాన్ని అమలుల్లోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం, పది రోజుల్లో అందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.