హైదరాబాద్/హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీర్పునకు వేళ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలకుగానూ ఆదివారం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అతితక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్ కేంద్రాలున్న భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. అత్యధిక పోలింగ్ కేంద్రాలు, ఎక్కువ ఓటర్లున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ఫలితం ఆలస్యం అయ్యే చాన్స్ ఉన్నది. భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.
కౌంటింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలో పోస్టల్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ చేపడతారు. ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తికాగానే, ఫలితాన్ని ధ్రువీకరణ కోసం పంపుతారు. అనంతరం ఆర్వో ఆధ్వర్యంలో రౌండ్లవారీగా మీడియాకు ఫలితాలు ప్రకటిస్తారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే సరిచేసేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలవద్ద టెక్నికల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతోపాటు అభ్యర్థులు, ఏజెంట్లు సహా పాస్‌లు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇతరుల ప్రవేశంపై నిషేధం విధించారు. అలాగే, అగ్గిపెట్టె, ఆయుధాలు, పేలుడు పదార్థాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి నిషేధించారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లనూ నిషేధించారు.
ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ (గెజిటెడ్ ఆఫీసర్, లేక ఆ సమాన హోదాగల అధికారి), ఒక కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సిబ్బంది, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం టేబుళ్ల వద్ద ఒక సహాయక రిటర్నింగ్ అధికారి, ఒక కౌంటింగ్ సూపర్వైజర్ (గెజిటెడ్ ఆఫీసర్, లేక ఆ సమాన హోదాగల అధికారి), ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు (గెజిటెడ్ ఆఫీసర్, లేక ఆ సమాన హోదాగల అధికారి), ఒక మైక్రో అబ్జర్వర్ చొప్పున నియమించారు. గతానికి భిన్నంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 500 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 131 టేబుళ్లను ఏర్పాటుచేశారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును పూర్తిచేయాలని, ఆ తర్వాతే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొలి ఫలితం రానుండగా, సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడవుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల 14, 20 చొప్పున ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా, యాకుత్‌పురా, కరీంనగర్, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల్లో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్నది. భద్రాచలం 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌కేంద్రాల్లో గత నెల 30న పోలింగ్ పూర్తికాగా, 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు తమ భవితవ్యం కోసం ఎదురుచూస్తున్నారు.