Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్న అధిష్ఠానం ప్రకటనతో నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ఎవరికి వారు తమ లాబీల ద్వారా టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు, ఇప్పటికే కొందరు అభ్యర్థులు టికెట్లు తమకు పక్కా అని చెప్పుకోవడం, అధిష్ఠానం పరిశీలనలోనూ వారి పేర్లే ఉండడంపై కొందరు నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పీసీసీ కీలక నేత టికెట్ల అమ్మకం మొదలు పెట్టారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. మహేశ్వరం నియోజకవర్గంలో ఓ నేత ఇప్పటికే దీనిపై బహిరంగంగా గళమెత్తారు. ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే చర్చ మొదలైంది. టికెట్ల కోసం డబ్బులు ముట్టజెప్పిన వారు బహిరంగంగానే ఆ విషయం చెబుతుండడం మరింత రచ్చకు దారితీసింది.
ఓ వ్యూహకర్త పేరుతో కాంగ్రెస్‌లో ప్రచారంలో ఉన్న సర్వేలపైనా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అవన్నీ ‘కొనుగోలు’ సర్వేలేనని, ప్రజాబలం ఉన్నవారికి, పార్టీ కోసం శ్రమించిన వారికి టికెట్లు దక్కకుండా కుట్ర జరుగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ, ఇటీవలే పార్టీలో పనిచేసిన వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నట్టు తెలుస్తుండడంపై సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలన్నీ అభ్యర్థుల అర్థబలం చూసేందుకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నవారిని ఎంచుకుని వారితో పీసీసీ కీలక నేతలు బేరసారాలకు దిగుతున్నట్టు చెబుతున్నారు. ‘పెట్టుబడి’ సామర్థ్యాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల నేతలు ఈ విషయాన్ని సీనియర్ నేతలకు చెప్పి వాపోయినట్టు తెలుస్తోంది.
టికెట్ ఆశిస్తున్న ఎన్నారైలను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తున్నది. టికెట్ కోసం ఓ ఎన్నారై వద్ద పీసీసీ ముఖ్యుడు ఒకడు అమెరికాలోని రెండు విల్లాలను రాయించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన తన సోదరుడి కుమారుడి పేరుతో వాటిని రాయించుకున్నట్టు సమాచారం. అమ్మకం..కొనుగోలు వ్యవహారంలా జరిగిన ఈ తతంగం తర్వాత సర్వేలో ఆ ఎన్నారై పేరు టాప్ ప్లేస్‌కి చేరినట్టు తెలుస్తున్నది. రూ. 5 వేల కోట్ల ఆస్తి ఉన్న ఆ ఎన్నారై ఇండియాలో పోటీ చేయాలన్న కోరిక తీర్చుకోవడానికే బరిలోకి దిగుతున్నట్టు చెప్తున్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానం కోసం పోటీపడుతున్న ఓ ఎన్నారైని అడ్వాన్స్‌గా రూ. 25 కోట్లు ఇవ్వాలని, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని పీసీసీ కీలక నేత ఆయనకు మాట ఇచ్చినట్టు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఓ ఎన్నారై కూడా డబ్బులు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయనతో భారీగా ఖర్చు చేయించినట్టు సమాచారం.
సర్వేలు, పార్టీలోకి వచ్చిన కొత్త నేతల హడావుడిపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్థానాలపై పీసీసీ నేత గురిపెట్టడం దారుణమని వాపోతున్నారు. కనీసం 40 స్థానాలైనా బీసీ నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కత్తి వెంకటస్వామి, పొన్నాల లక్ష్మయ్య, వీ హన్మంతరావు, మహేశ్‌కుమార్ గౌడ్ తదితర నేతలు శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, మాణిక్‌రావు ఠాక్రేను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు టికెట్లు ఇవ్వకుంటే తాము రెబల్‌గా పోటీ చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించినట్టు సమాచారం. బీసీ జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. సర్వే విధానంపైనా వారు అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని వారు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో టికెట్ల కోసం జరుగుతున్న బేరసారాలు, అమ్మకాలు వార్తలను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్న వారు రేపు అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్మేయరా? అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కోసం ఐదెకరాలు, రూ.10 కోట్లు తీసుకున్నట్టు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.. ఒకవేళ నువు తీసుకోకుంటే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చెయ్యి.. లేకుంటే నువు టికెట్ అమ్ముకున్నట్టే లెక్క.. అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్‌రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సీటుకు నోటు’ వ్యవహారం రచ్చ రేపుతున్న నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డిపై మనోహర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌కు ఐదెకరాలు, రూ.10 కోట్లు ఇచ్చి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను తెచ్చుకున్నామని బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి చెప్తున్నారనే విషయాన్ని మాత్రమే గతంలో తాను బహిర్గతం చేశానని చెప్పారు. ఢిల్లీలో సీనియర్ నేత వీహెచ్ ఇదే విషయమై తనను వాకబు చేసినట్టు చెప్పానే తప్ప స్వయంగా ఎక్కడా ఆరోపణ చేయలేదని స్పష్టం చేశారు.
దీనిపై ఎలాంటి విచారణ చేయకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ డీసీసీపై ఒత్తిడి తెచ్చి కేవలం రెండు నిమిషాల్లో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ హుకుం జారీ చేశారని చెప్పారు. ఏకపక్షంగా పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రూ.25 కోట్లు తీసుకున్నాడన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణపై భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేశావని, మరి ఇప్పుడు టికెట్ కోసం ఐదెకరాలు, రూ.10 కోట్లు తీసుకోలేదని అదే అమ్మవారిపై ప్రయాణం చేయలేవా.. అంటూ డిమాండ్ చేశారు. రేవంత్‌పై వచ్చిన ఆరోపణలపై ఏఐసీసీ అగ్రనేతలు విచారణ జరపాలని, అసలు డబ్బులిచ్చిన వారిని, తీసుకున్న రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో మోనార్క్‌లా వ్యవహరిస్తున్న రేవంత్ దమ్ముంటే మహేశ్వరంలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. మహేశ్వరంతోపాటు రేవంత్ ఎక్కడ పోటీచేసినా తాను అక్కడి పోటీ చేస్తానని మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.