(ఛత్రపతి శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం) ఏప్రిల్ 24: మహారాష్ట్ర నడిబొడ్డున బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిర్వహించిన మూడో బహిరంగ సభ దిగ్విజయవంతమైంది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని 15ఎకరాల జబిందా మైదానం జనసంద్రమైంది. పట్టణంలోని యువతీయువకులు, వ్యాపారులు భారీగా సభకు కదిలివచ్చారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కారు నినాదాలతో ఔరంగాబాద్ పట్టణమే మార్మోగిపోయింది. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం సభికులు ఆసక్తితో ఆలకించడంతోపాటు నూతనోత్సాహంతో కేరింతలు కొట్టారు. ఈలలతో సభను హోరెత్తించారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగిన తొలిసభకు, మార్చి 26న లోహాలో నిర్వహించిన రెండోసభకు మించి రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఔరంగాబాద్, సిల్లోడ్, సియోగావ్, వైజాపూర్, గంగాపూర్, ఫైఠాన్, ఫులంబ్రి, కన్నాడ్ మొత్తంగా తొమ్మిది తాలుకాలతోపాటు జాల్నా, జలగావ్ జిల్లాల్లోని సమీప తాలుకాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పల్లెపల్లెనా బీఆర్ఎస్ శ్రేణులు 15 రోజులుగా ప్రచారం చేయగా ఆయా గ్రామాల నుంచి జనం పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని అన్ని డివిజన్లకు చెందిన ప్రజలతోపాటు పట్టణ వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులు, దినసరి కూలీలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఒక్క పట్టణంలోనే దాదాపు 50 వేల మందికిపై కదలిరాగా, మైదానం నిండిపోయింది. ఫ్లైఓవర్లపైన, బిల్డింగులపై జనం ఎక్కడికక్కడ గుమిగూడి, రోడ్ల వెంట బారులు తీరి కనిపించారు. మరోవైపు పట్టణమంతా గులాబీమయమైంది. ప్రధాన రహదారులను గులాబీ తొరణాలు, భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. బీఆర్ఎస్ సభపై స్థానికంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పట్టణంలో గతంలో కాంగ్రెస్, బీజేపీ, శివసేననే కాకుండా మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదని స్థానికులు చర్చించుకోవడం విశేషం.
జబిందా మైదానమే కాకుండా యావత్ ఔరంగాబాద్ నగరం యావత్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో మార్మోగిపోయింది. సభ వేదిక నుంచి చుట్టూ దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు మైకులను అమర్చారు. ఇక కేసీఆర్ సభా వేదికకు చేరుకోగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దేశ్ కీ నేతా కైసే హో.. కేసీఆర్ జైసే హో.. కేసీఆర్ తుమ్ ఆగే బడో.. హమ్ తుమ్హారే సాథ్, జయహో కేసీఆర్.. జయహో భారత రాష్ట్ర సమితి నినాదాలతో కర్షకులు, కూలీలు హోరెత్తించారు. కూర్చున్న సీట్ల నుంచి పైకి లేచి జేజేలు పలికారు. చప్పట్లతో ఘనస్వాగతం పలికారు.
(ఛత్రపతి శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం) ఏప్రిల్ 24:మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతున్నది. ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల నేతలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. సోమవారం జబిందా మైదాన్ సభలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మేధావులు, వైద్యులు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నాసాహెబ్ మానే పాటిల్, హర్షవర్ధన్ జాదవ్, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు అబ్దుల్ కదీర్ మౌలానా, అభయ్ పాటిల్ , విజయ్ ప్రకాశ్ థంబేర్, నాయకులు సంతోష్ మానే పాటిల్, అప్పాసాహెబ్ మానే పాటిల్, మాజీ మేయర్ దిలిప్ అన్నా గోరె, శివసేన రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ డాక్టర్ శివరాజ్ బంగర్, జెడ్పీ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ పటేల్, మాజీ కౌన్సిలర్ బాలాసాహెబ్ సనప్, స్వాభిమాని జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కర్పే, అమిత్ భాంగే, ఆదిత్యవర్ధన్ హర్షవర్ధన్ జాదవ్, అడ్వకేట్ రాజేశ్ సావంత్, అడ్వకేట్ వినోద్‌జీ నింబాలర్ బీఆర్ఎస్లోకి చేరారు. ఔరంగబాద్ ప్రాంతంలో ప్రజావైద్యుడిగా పేరుపొందిన డాక్టర్ వైద్య బీఆర్ఎస్లోకి చేరడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.