హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్-2025 తెలుగు ఎడిషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నది. ఈ నివేదిక ఇంగ్లిష్ ఎడిషన్ మార్చి నెలలోనే విడుదల కాగా, తెలుగు ఎడిషన్ నేటికీ విడుదల కాలేదు. ఫలితంగా పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రామాణిక పుస్తకాలు అందబాటులో లేక, నూతన గణాంకాలు లభించక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రణాళికాశాఖ బుక్స్ ముద్రణలో నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్.. రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులను విశ్లేషించి, ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేసే కీలక డాక్యుమెంట్. ఇది పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులకు అత్యంత ముఖ్యమైన సమాచార సాధనం. గతంలో తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతూ ఉండేది. తెలుగు, ఇంగ్లిష్ ఎడిషన్లు అందుబాటులో ఉంటే విదేశీ పెట్టుబడిదారులు, పరిశోధకులు, విశ్లేషకులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు గణాంకాలు, రాష్ట్ర ఆర్థిక సామాజిక పరిస్థితులు సులభంగా అర్థమయ్యేవి. అయితే, ఈ ఏడాది ఇంగ్ల్లిష్ ఎడిషన్ మాత్రమే మార్చిలో విడుదల కావడంతో, తెలుగు మాధ్యమ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు.
తెలుగు ఎడిషన్‌ను విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్) డైరెక్టర్ రూఫస్ ధత్తం తెలిపారు. ఇంగ్లిష్ ఎడిషన్‌ను తెలుగులో అనువాదం చేసేందుకు నిపుణులకు పంపించామని చెప్పారు. అది పూర్తికాగానే 400-500 కాపీలు కావాలని ప్రింటింగ్ కోసం పంపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సోషియో ఎకనమిక్ సర్వే తెలుగు ఎడిషన్ జూన్ ఫస్ట్ వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
ప్రతి బడ్జెట్ సమయంలోనే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం పుస్తకం విడుదల చేస్తారు. ఇంగ్లిష్‌లో, తెలుగులో కూడా ప్రచురిస్తారు. కానీ, ఇప్పటివరకు తెలుగు ప్రచురణ ముద్రించలేదు. కనీసం పీడీఎఫ్ కూడా విడుదల చేయలేదు. ఇలా అయితే నిరుద్యోగులు ఎలా చదువుకునేది. తెలుగు ఎడిషన్ లేకపోవడం వల్ల పరీక్షలకు సిద్ధపడేందుకు ఆటంకం ఏర్పడుతున్నది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు ఉన్నపుడు మాత్రమే తెలుగు ప్రచురణ చేస్తారా? ప్రముఖ ప్రైవేటు సంస్థ మాత్రం ఇంగ్లిష్ ప్రచురణ విడుదలైన రెండు మూడు రోజుల్లోనే తెలుగు ఎడిషన్ ముద్రించింది. ఇది ఎలా సాధ్యం? గత ఏడాది కూడా ఇలాగే జరిగింది. ఆ ప్రైవేటు సంస్థ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తిది. ఆయనకు లాభం చేకూర్చడానికే తెలు గు ఎడిషన్ ముద్రించడం లేదా? అనే అనుమానం మా నిరుద్యోగుల్లో కలుగుతున్నది.