యాదగిరిగుట్ట, ఏప్రిల్ 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై ప్రతి కట్టడానికి ఆధ్యాత్మిక హంగులు అద్దారు. కొండపైన గల తెలంగాణ టూరిజం హరిత అతిథి గృహ సముదాయాన్ని కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు గురువారం పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.
భవనానికి ఉత్తర ప్రాంతంలో బాల్కనీ తొలగించారు. సీఎం కేసీఆర్ సూచనలతో వైటీడీఏ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి హరిత అతిథి గృహ సముదాయానికి కొత్త నామూనాలను సిద్ధం చేయగా సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. విశ్వవిఖ్యాతిగాంచిన యాదగిరిగుట్ట దేవస్థానానికి దేశ నలమూలలతోపాటు విదేశీయులు సైతం వస్తున్నారు. వారందరిని హరిత హోటల్ సముదాయం ఆకట్టుకునేలా కాకతీయ పిల్లర్లు, దేవతామూర్తులు, పంచనారసింహుడి ప్రతిమలు ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. కిటికీలు, దర్వాజలతోపాటు ప్రతి గదిని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. త్వరలోనే హరిత భవన్ సరికొత్త రూపుతో భక్తులను ఆకట్టుకోనున్నది.