TREIRB | హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో దివ్యాంగుల కోటా అభ్యర్థుల తుది జాబితా వెల్లడిలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇతర అన్ని క్యాడర్ పోస్టుల ఫలితాలను ప్రకటించినా, దివ్యాంగుల కోటా అభ్యర్థులను ఇప్పటివరకు వెల్లడించలేదు. 1:2 జాబితాను ప్రకటించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించినా తుది జాబితాను ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. 9,210 గురుకుల పోస్టులకు సంబంధించి ట్రిబ్ నియామక ప్రక్రియ చేపట్టింది.
డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్ పోస్టులకు తొలుత 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో పీడబ్ల్యూడీ కోటా అభ్యర్థులు సైతం ఉన్నారు. గత ఫిబ్రవరిలో అలాట్మెంట్ ఆర్డర్లను సైతం అందజేసింది. అందులో పీజీటీ పోస్టుల పీడబ్ల్యూడీ అభ్యర్థులు సైతం ఉన్నారు. డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు మాత్రం పీడబ్ల్యూడీ కోటా అభ్యర్థుల 1:1 జాబితాను మాత్రం ఇప్పటివరకు ట్రిబ్ ప్రకటించనేలేదు.
త్వరలోనే ఆ జాబితాను విడుదల చేస్తామని చెప్పి ఫిబ్రవరిలోనే ట్రిబ్ వెబ్నోట్ను పెట్టింది. 4 నెలలు గడిచినా ఇప్పటివరకు దానిపై ఉలుకూపలుకు లేదు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 7వ జోన్ పరిధిలో 1:1 అభ్యర్థుల జాబితాను సైతం ట్రిబ్ ప్రకటించలేదు. ఎన్నికల కోడ్ ముగిసి 10 రోజులు దాటినా ట్రిబ్ స్పందించకపోవడంపై ఆయా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.