హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు, ప్రత్యేకంగా ఆడియో-విజువల్ రూమ్‌ను సందర్శించారు. అనంతరం కమిటీ చైర్మన్ కే కేశవరావు నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించేందుకు ఈనెల 23 నుంచి వివిధ వర్గాల నుంచి సంప్రదింపులు జరుపాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిపింది.
2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారుల గురించి రాజకీయాలకు అతీతంగా గుర్తించాలని పేర్కొన్నది. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానానికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డి పాల్గొన్నారు.