హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ పువ్వుల విక్రయాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మార్కెట్లు, పువ్వులు, పండ్ల మార్కెట్లు, రైతుబజార్‌ల్లో ప్లాస్టిక్ పువ్వుల విక్రయాలను నిషేధిస్తూ మార్కెటింగ్‌శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే జరిమానాతోపాటు లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది. సహజ పు వ్వులు, వాటి ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించిం ది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల రైతు మేళాకు హాజరైన సమయం లో ప్లాస్టిక్ పువ్వుల విక్రయాలతో సహజ పువ్వుల విక్రయాలు సక్రమంగా జరగడంలేదని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో తుమ్మల స్పందిస్తూ మార్కెట్లలో ప్లాస్టిక్ పువ్వుల అమ్మకాలకు అనుమతిలేదని, వాటి విక్రయాలు అనుమతించొద్దని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించింది.