హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ముందుగా విచారణ పూర్తిచేయాలని ఏపీ చేస్తున్న వాదనలు అర్థరహితమని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ ప్రభుత్వం తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ అభ్యర్థన మేరకు అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం-1956, సెక్షన్ 3 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పంపిణీ చేపట్టాలని ట్రిబ్యునల్‌కు కేంద్ర జల్‌శక్తిశాఖ గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని ఏపీ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మరోవైపు సెక్షన్ 3 ప్రకారం విచారణ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ విచారణ ముమ్మరం చేశారు. సెక్షన్ 3 అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, తొలుత సెక్షన్ 89 ప్రకారం విచారణ పూర్తిచేయాలని ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సెక్షన్ 89 కేవలం ప్రాజెక్టుల వారీగా మాత్రమే జలాలను కేటాయించాలని నిర్దేశిస్తున్నదని తెలంగాణ తెలిపింది. రెండు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల కేటాయింపులే లేవని వివరించింది.