Caste Survey | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కులగణన రీసర్వేకు ప్రజల నుంచి స్పందన కరువైంది. నాలుగు రోజులుగా నమోదవుతున్న వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం నిరుడు నవంబర్‌లో నిర్వహించిన ఇంటింటి సర్వేలో దాదాపు 3.54 కోట్ల మంది పాల్గొనగా, 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్నారు. ఆ సర్వేలో నమోదు చేసుకోని వారి కోసం ఈ నెల 16న ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. 16వ తేదీ నుంచి గురువారం వరకు 4 రోజుల్లో 4625 కుటుంబాలు మాత్రమే రీసర్వేలో పాల్గొని వివరాల నమోదు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో 4,227, వెబ్సైట్ ద్వారా 398 మంది సర్వే ఫారాలు డౌన్లోడ్ చేసుకున్నట్టు సమాచారం. టోల్‌ఫ్రీ నంబర్ 040-2111111కు 6,415 కాల్స్ వచ్చినట్టు అధికారులు చెప్పారు.
అంగన్వాడీ టీచర్ల వల్లనే కులగణన సర్వే కొంతవరకు సరిగా జరగలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రీసర్వేలోనైనా ప్రజలు వివరాలను నమోదు చేసుకోవాలి. సర్వేపై పలు రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా అంగన్వాడీ టీచర్లపై కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. వారి కారణంగానే సర్వే సరిగా జరగడం లేదని చెప్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్ 040-21111111ను సంప్రదిస్తే ఎన్యుమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేసుకుంటారు.
-నిరంజన్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్