TSRTC | మొదలు.. తనకు మర్యాద దక్కడంలేదని అర్థంలేని లొల్లి. ఆ తర్వాత.. బీజేపీ నేతగా అవతారమెత్తి బీఆర్ఎస్తో కొట్లాట. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టే పన్నాగం. ఆ పై.. ప్రభుత్వ కార్యక్రమాలపై పనిగట్టుకొని బురదచల్లడం. చివరకు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేందుకు యత్నం. తాజాగా.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనూ దెబ్బతీసే ఎత్తుగడ.
…ఇదీ గవర్నర్ తమిళిసై వ్యవహారశైలి. శృతిమించి రాగాన పడ్డట్టు.. లేని అధికారాలను ఊహించుకొని గవర్నర్ హోదాకు తగని రీతిలో వ్యవహరిస్తున్న తమిళిసై తాజాగా మరోసారి లక్ష్మణరేఖ దాటారు. విషాదమేమిటంటే ఈసారి ఆమె చేసిన పని వేలమంది పేద కార్మికుల పొట్టకొట్టే పని. వారి భవిష్యత్తును అంధకార బంధురం చేసే పని. చీకట్లో చిరుదీపంలా వెలిగిన వారి ఆశను చిదిమేసే పని.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఇప్పటికే పలుమార్లు తొక్కిపెట్టిన గవర్నర్ తమిళిసై.. తాజాగా ఆర్టీసీ విలీనం బిల్లును తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించలేదు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కనుక పెట్టలేకపోతే.. శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా పడినట్టే. వేలమంది జీవితాలతో ముడిపడి ఉన్న బిల్లుకు కీలక సమయంలో రాజ్‌భవన్ మోకాలడ్డటంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. బిల్లుకు అడ్డుపడితే సహించేదిలేదని హెచ్చరించిన కార్మిక సంఘాలు.. గవర్నర్ తీరుకు నిరసనగా నేడు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు చేపట్టారు. ఉదయం 6 నుంచి 8గంటల వరకు బస్సులను నిలిపివేసి, తమ నిరసనను తెలియజేశారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): బిల్లులకు ఆమోదం విషయంలో రాష్ట్ర గవర్నర్ తీరు ఏమాత్రం మారలేదని మరోసారి రుజువయ్యింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ మానవీయ కోణంలో తీసుకొన్న నిర్ణయాన్ని గవర్నర్ నిర్దయగా అణగదొక్కుతున్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే పలు బిల్లులను కావాలనే కక్షపూరితంగా నెలలపాటు తొక్కిపెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఇప్పుడు 43 వేల మందికిపైగా కార్మికుల కుటుంబాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీ బిల్లుపై కూడా అదే స్థాయిలో తాత్సారానికి తెరలేపారు.
కార్మికుల బంగారు భవిష్యత్తుకు మోకాలడ్డు
ఆర్టీసీనే నమ్ముకొని జీవితం గడుపుతున్న కార్మికుల కష్టాలు, నష్టాలు, కన్నీటిని అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ ఒకే ఒక్క నిర్ణయంతో వాటన్నింటికీ చెక్ పెట్టారు. ఆర్టీసీని సర్కారులో విలీనం చేయాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. దీంతో 43,373 మంది కార్మికుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో వెంటనే ముసాయిదా బిల్లును సిద్ధం చేయించారు. అది ద్రవ్య సంబంధ బిల్లు కావటంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాజ్యాంగపరంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. దీంతో ముసాయిదా బిల్లును గవర్నర్ వద్దకు పంపించారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయిస్తే కార్మికుల కుటుంబాలకు సత్వరమే లాభం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపించి అనుమతి కోరింది. కానీ బిల్లుకు రాజ్‌భవన్ మోకాలడ్డుతున్నది. బిల్లులోని పలు అంశాలపై సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరామని బిల్లు పంపిన రెండురోజుల తర్వాత శుక్రవారం రాత్రి రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపుతున్నారని మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో అధికశాతం బడుగు, బలహీన, పేద వర్గాలే ఉన్నారు. ఈ బిల్లు పాస్ అయిన తరువాత వారందరూ ప్రభుత్వ ఉద్యోగులవుతారు. జీతభత్యాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగ భద్రత కూడా లభిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బిల్లుపై కూడా కాలయాపన చేసేలా గవర్నర్ వ్యవహరించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
న్యాయ సలహా పేరుతో కొర్రీ
ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లు (ది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ టు గవర్నమెంట్ సర్వీసెస్) బిల్, 2023)పై రాజ్‌భవన్ తాపీగా స్పందించింది. ఈ ముసాయిదా బిల్లును పరిశీలించడానికి మరింత సమయం అవసరమని, న్యాయ సలహా తీసుకొని ఆపై నిర్ణయం వెల్లడిస్తామని కొర్రీ పెట్టింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 3నే ప్రారంభమయ్యాయి. రాజ్‌భవన్ మాత్రం శుక్రవారం సాయంత్రానికి స్పందించింది. అంటే రెండు రోజుల సమావేశాలు అప్పటికే ముగిశాయి. మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంటే గిట్టని గవర్నర్.. ఇప్పుడు ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు అనుమతించకుండా న్యాయ సలహా పేరుతో కొర్రీ వేయడంపై కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు టీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సిద్ధమయ్యారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆధ్వర్యంలో 96 యూనిట్ల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టాలని టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం థామస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డిపోలు, బస్టాండ్ల వద్ద గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు.
రాజ్యాంగ బద్ధమా? రాజకీయాలకు కేంద్రమా?
రాష్ట్ర గవర్నర్ సాధారణంగా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే రాజ్యాంగపరమైన పదవి. కానీ తెలంగాణ గవర్నర్‌గా తమిళిసైని రాష్ట్రంలో బీజేపీకి కొమ్ముకాయడానికి, బీఆర్ఎస్తో రాజకీయాలు చేయడానికే నియమించారేమో అనే అనుమానం కలుగుతున్నదని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు బిల్లులను న్యాయ సలహా కోసం, మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదనే నెపంతో తొక్కిపెట్టడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును 11 నెలలుగా తనవద్దే పెట్టుకున్నారు. దీంతో వందలమంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రాజ్యంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయాలకు దిగుతున్నారని, కావాలనే ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తొక్కిపెట్టారని విమర్శలు వచ్చాయి. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన మరో రెండు బిల్లులను కూడా ఆరునెలల నుంచి తనవద్దే పెట్టుకుని కాలయాపన చేస్తున్నారు. రాజ్‌భవన్‌ను గవర్నర్ రాజకీయాలకు కేంద్రంగా ఉపయోగించుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు
ఆర్టీసీ కార్మికుల కల నెరవేరే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం దారుణం. కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కోరికను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని 43 వేల మంది కార్మికుల కుటుంబాలు సంతోషంగా సంబురాలు చేసుకున్నాయి. ఇప్పుడు బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు అనుమతివ్వకపోవడం భావ్యం కాదు. రాజకీయాల కోసం కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం గవర్నర్‌కు తగదు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో శనివారం నిరసన చేపట్టాలని పిలుపునిచ్చాం. తర్వాత భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తాం.
– ఏఆర్ రెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు
కార్మికులతో రాజ్‌భవన్‌ను ముట్టడిస్తాం
ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతివ్వకపోవడం అన్యాయం. కార్మికుల చిరకాల కోరికను తీరుస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడం గవర్నర్‌కు తగదు. బిల్లు ఆగిపోతే 43,373 మంది కార్మికులకు అన్యాయం జరుగుతుంది. గవర్నర్ తీరుకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ఎదుట బస్సులు నిలిపివేసి, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించాం. ఉదయం 11 గంటలవరకు కార్మికులందరూ నెక్లెస్‌రోడ్డుకు తరలిరావాలి. 11 గంటలకు నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరుతాం.
– థామస్‌రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తీరు దారుణం
ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ అనుమతివ్వకపోవడం దారుణం. సీఎం నిర్ణయంతో సంతోషంగా ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్వత్రా మద్దతు లభించింది. బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే దశలో గవర్నర్ అడ్డుకోవడం భావ్యం కాదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మూడేండ్లుగా పోరాడుతున్నాం. ఇప్పటికే రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ సీఎం నిర్ణయంతో ఉద్యోగ భద్రత లభిస్తుందనే సంతోషంలో ఉన్న సమయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం వెల్లడించడం సమంజసం కాదు. గవర్నర్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని అనుమతివ్వాలి. లేనిపక్షంలో రాజ్‌భవన్ ముట్టడికి కూడా వెనుకాడం.
– ఎన్ కమలాకర్‌గౌడ్, టీఎంయూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్
మరోసారి సమ్మెకు వెనుకాడం
గవర్నర్ తీరు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆవేదనకు గురిచేస్తున్నది. చిరకాల కోరిక నెరవేరుతుందని సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి వార్త వినడం ఆందోళన కల్గిస్తున్నది. ఆర్టీసీ విలీనానికి ఏపీలో తలెత్తని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయో అర్థంకావడం లేదు. గవర్నర్ ఒక్క ఫ్యాక్స్ ద్వారా అక్కడ అమలు చేసిన విధానాలను తెలుసుకోవచ్చు. రాజకీయాల కోసం కార్మికుల న్యాయమైన కోరికలను అడ్డుకోవద్దు. మరోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడానికి కూడా వెనుకాడరు.
– బీ యాదయ్య, టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్