విష వలయాన్ని ఛేదించి…
ఒక్క ప్రాజెక్టులోనూ పట్టుమని పది టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు ఉండవు… కానీ పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామంటారు. మరో ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు ఖర్చు పెడతారుగానీ బరాజ్ నిర్మాణాన్ని అంతర్రాష్ట్ర వివాదంలోకి నెడతారు. ఇంకో ప్రాజెక్టు తెలంగాణ ఖాతాలో కనిపిస్తుంది. ఆయకట్టు లక్ష్యం కృష్ణా డెల్టాలో దాగి ఉంటుంది.
ఇలా దశాబ్దాల తరబడి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు విష వలయంలో చిక్కుకుని కాంట్రాక్టర్ల కామధేనువుల్లా మారాయే తప్ప ఎకరా భూమికి సాగునీరు ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరంలేదని… ప్రాజెక్టులు కట్టాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ బహుముఖ కోణంలో డిజైన్ చేశారు. పట్టుబట్టి వేల కోట్ల నిధులు ఇచ్చి, ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ ప్రాజెక్టుల పనులను పరుగెత్తించారు. జలయజ్ఞం కింద చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు.
ఆ చిత్తశుద్ధి ఫలితంగానే కేవలం తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ సాగునీటి, వ్యవసాయ రంగ ముఖచిత్రాలే మారిపోయాయి. రాష్ట్ర ఏర్పాటు నాటికి వానకాలం, యాసంగి కలిపి మొత్తంగా 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా, నేడు అది ఏకంగా 2.30 కోట్ల ఎకరాలకు పెరిగింది. గోదావరి, కృష్ణా నదీజలాల కేటాయింపుల్లో ఉమ్మడి పాలనలో తెలంగాణలోని ప్రాజెక్టుల కింద వానకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి నీటి వినియోగం గరిష్ఠంగా 300 టీఎంసీల లోపు ఉంటే ఇప్పుడు ఒక్క యాసంగి సీజన్లోనే 330 టీఎంసీల పైచిలుకు నీటి వినియోగం ఉన్నది. అందుకే గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో రాష్ట్రంలో సాగునీటి వసతుల కల్పనలో 76.92 శాతం వృద్ధి నమోదయ్యింది.
Lakshmi Pump House
దేశానికే పాఠాలు నేర్పిన తెలంగాణ…
గతంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టడమంటే ముగ్గురు, నలుగురు ముఖ్యమంత్రులు మారినా పూర్తికాని పరిస్థితి. కానీ తెలంగాణ రైతుల గోడు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్లలోనే పూర్తి చేసిన కేసీఆర్ రాష్ర్టాన్ని దేశ సాగునీటి రంగానికి దిక్సూచిలా నిలిపారు.
తెలంగాణకు గుదిబండలా మారిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి రూపకల్పన చేసిన కాళేశ్వరం ఎత్తిపోతలతో ఏడాది పొడవునా గోదావరిలో జలకళ ఉట్టిపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016, మే 2న శంకుస్థాపన చేయగా.. 2019, జూన్ 21న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అప్పటివరకు గోదావరి నుంచి 90 టీఎంసీలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేని విషమ పరిస్థితి నుంచి నేడు గరిష్ఠంగా 400 టీఎంసీలు వినియోగించుకునే స్థాయికి ఎదిగాం. శ్రీరాంసాగర్ చరిత్రలో ఇప్పుడు తొలిసారిగా కాకతీయ కాల్వ చివరి ఎకరా వరకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపాదన దశాబ్దాల కిందటిది. కాంగ్రెస్ పార్టీ నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే దానిపైనే సంవత్సరాల తరబడి కాలయాపన చేసింది. చివరకు పట్టుమని పది టీఎంసీల నీటి నిల్వ లేని జూరాల నుంచి ఇన్‌టేక్ పాయింట్ పెట్టి తెలంగాణకు ద్రోహం చేసేందుకు ప్రయత్నించింది. కానీ సీఎం కేసీఆర్ ఏకంగా శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ నుంచి ఇన్‌టేక్ పాయింట్ పెట్టి పనుల్ని పరుగులు పెట్టించారు. తెలంగాణ ఏర్పడేనాటికి తాగునీటికి సైతం గుక్కెడు నీరు దొరకని ఉమ్మడి పాలమూరు గడ్డ మీద ఏకంగా 70 టీఎంసీల నీటి నిల్వకు రిజర్వాయర్లు పూర్తి చేయడమంటే చరిత్రలోనే ఒక రికార్డు.
Mid Manair
చారిత్రక అంతర్రాష్ట్ర ఒప్పందాలు
అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులంటేనే మనకు గుర్తుకొచ్చేది… 1970 దశకం. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిపై అనేక ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నారేగానీ ఏ ఒక్కదాన్నీ కొస వరకు తీసుకుపోలేదు. చివరకు ప్రాణహిత-చేవెళ్లకు సంబంధించి తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తామని చెప్పి… 2008 నుంచి 2014 వరకు అసలు మహారాష్ట్రతో సంప్రదింపులు కూడా జరపలేదు. ఫలితంగానే 2013లో అప్పటివరకు బరాజ్ పనులు మొదలు పెట్టకుండానే సొరంగాలు, కాల్వలు తవ్వకానికి వెచ్చించిన రూ.8 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ కూడా రాశారు.
ముఖ్యంగా కేంద్రం… మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత-చేవెళ్లపై అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదంటే ఆ పార్టీకి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో సీఎం కేసీఆర్ గోదావరిపై మహారాష్ట్రతో ఒకేరోజు ఏకంగా మూడు ఒప్పందాలు చేసుకోవడం చారిత్రాత్మక పరిణామం.
1.లోయర్ పెనుగంగ : చనాక-కొరాట బ్యారేజీ
2. ప్రాణహిత ప్రాజెక్టు : తుమ్మిడిహట్టి బ్యారేజీ (184 మీటర్లు)
3. కాళేశ్వరం ప్రాజెక్టు : మేడిగడ్డ బ్యారేజీ (వంద మీటర్లు)