హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ కోసం రెండు కమిషన్లు ఏర్పాటు చేయాలని ‘తెలంగాణ విద్యాకమిషన్’ ప్రతిపాదించింది. జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో, రాష్ట్రస్థాయిలో రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఫీజు రెగ్యులేటరీ కమిషన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి మూడేండ్ల బ్లాక్ పీరియడ్‌కు ఈ కమిషన్లు ఫీజులను ఖరారుచేస్తాయి. ఈ కమిషన్‌కు ‘తెలంగాణ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్’ అన్న పేరును ఖరారుచేసింది.
ఫీజుల నియంత్రణే ధ్యేయంగా ఇంతకాలం కసరత్తు చేసిన విద్యాకమిషన్ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను కలిసిన కమిషన్ సభ్యులు ఫీజుల నియంత్రణపై రూపొందించిన నివేదికను అందజేశారు. బడులను ఇంటర్నేషనల్, కార్పొరేట్, ప్రైవేట్, బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు, గ్రామీణ స్కూళ్లు అనే ఐదు క్యాటగిరీలుగా విభజించింది. వాటికి వేర్వేరు ఫీజులను ఖరారుచేయాలని సూచించింది. నివేదికను క్యాబినెట్ ఆమోదించిన అనంతరం అసెంబ్లీలో బిల్లు పెడతారు. ఆ తర్వాత చట్టంగా అమల్లోకి వస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి చట్టం రూపొందించి కమిషన్లను ఏర్పాటు చేయాలన్న దిశలో విద్యాశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.