హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బాలల హక్కుల కమిషన్ రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రంగుల కండువా కప్పుకున్న వారికే కమిషన్ పదవుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. చైర్పర్సన్ సహా ఇతర పదవుల్లో అధికార పార్టీకి చెందిన వారికే చోటు లభించిందని అంటున్నారు. నిబంధనలకు నీళ్లు వదిలి, న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా దొడ్డిదారిలో పదవుల పందేరం జరిగినట్టు తెలుస్తున్నది. అర్హతలేని వారిని అందలమెక్కించడంపై సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుండగా అధికార పార్టీ నుంచి కూడా భిన్నస్వరాలు వినిపించడం కొసమెరుపు.
చైల్డ్‌రైట్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్పర్సన్, ఇతర సభ్యుల నియామకంలో ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఓ అగ్రనేత చక్రం తిప్పి పై‘చేయి’ సాధించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు తోసిరాజని అనేకమంది ముఖ్యనేతలు, మంత్రుల అభ్యంతరాలను పక్కనబెట్టి పట్టుబట్టి ఆయన తన పంతం నెగ్గించుకున్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పూర్వాశ్రమంలోని పార్టీలో తనతో కలిసి పనిచేసిన నాయకురాలు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డిని చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆమె అధికార పార్టీలో చేరిన సమయంలో ఇచ్చిన హామీ మేరకే ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీలో తనకు అత్యంత ఆప్తుడు, కీలక పదవిలో ఉన్న నాయకుడి సమీప బంధువుకు కమిషన్ పాలకవర్గంలో చోటు కల్పించారు. అలాగే కాంగ్రెస్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారి భార్య, నాన్‌లోకల్ వ్యక్తికి సైతం అవకాశం ఇచ్చారు.
చైల్డ్‌రైట్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్పర్సన్, ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావాహులు, స్వచ్ఛందసంస్థల బాధ్యులు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా రాత్రిరాత్రే రహస్యంగా జీవో ఆర్టీ నంబర్ 45ని విడుదల చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తెల్లవారగానే శుక్రవారం ఉదయమే హడావుడిగా చైర్‌పర్సన్‌గా నియామకమైన సీతా దయాకర్రెడ్డితోపాటు సభ్యులు కంచెర్ల వందనాగౌడ్, మరిపల్లి చందన, బీ అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, బీ వచన్కుమార్తో ప్రమాణం స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. న్యాయస్థానంలో ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
బాలల కమిషన్ చైర్పర్సన్, సభ్యుల నియామకంలో ప్రభుత్వం నిబంధనలను నిట్టనిలువునా పాతరేసింది. చట్టం ప్రకారం కనీసం ఏడేండ్లు సమాజాభివృద్ధి, బాలల అభ్యున్నతికి కృషిచేసి, 35 ఏండ్లు నిండిన వ్యక్తులను కమిషన్ పదవుల్లో నియమించాలి. దీనిపై గతంలో కోర్టులు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీచేశాయి. కానీ కాంగ్రెస్ సర్కారు ఇందుకు విరుద్ధంగా సామాజిక సేవతో సంబంధంలేని వారికే బాధ్యతలు అప్పగించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు సభ్యులు మినహాయించి మిగిలిన వారంతా రాజకీయ పార్టీలకు చెందినవారే కావడం గమనార్హం. బాలబాలికలకు సేవలందించడంలో కీలకంగా వ్యవహరించే చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ బాధ్యతలను ఫక్తు రాజకీయ నేతకు ఇవ్వడంలోని మతలబేంటని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
బాలల హక్కుల పరిరక్షణలో ఎంతో కీలకమైన కమిషన్‌లో నియమించిన సభ్యుల విషయంలో పలువైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండగా, అధికార పార్టీలోనూ వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం. చైర్‌పర్సన్‌గా సీతాదయాకర్‌రెడ్డి విషయంలో పార్టీ అగ్రనేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కొంతకాలం కిందటే పార్టీలో చేరి, పార్టీ కోసం ఏమీ చేయని వ్యక్తికి ఇంతటి ముఖ్యమైన బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.