Telangana | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జయకేతనమే అని తేలిపోయింది. ఏ సర్వే తీసుకొన్నా.. ఏ ఒపీనియన్ పోల్ చూసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని సుస్పష్టం అవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని వెల్లడవుతున్నది. ఇండియా టీవీ, మిషన్ చాణక్య, ఎన్పీఐ, ఈఎన్టీ, ప్రముఖ జర్నలిస్టుల ఒపీనియన్ పోల్స్‌లో ఆ వర్గం.. ఈ వర్గం అన్న తేడాలేకుండా సబ్బండ వర్గాలు సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల సంతృప్తిని వ్యక్తంచేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ కొలువుదీరాలని ఆకాంక్షిస్తున్నాయి. తాజాగా, 77 సీట్లతో అధికారం మరోసారి బీఆర్ఎస్దేనని రాజ్‌నీతి ఒపీనియల్ పోల్ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీ 64 -70 సీట్లతో హ్యాట్రిక్ కొడుతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే సంస్థ వెల్లడించింది. కౌలు రైతుల్లో 47శాతం, రైతుల్లో 53 శాతం, విద్యార్థుల్లో 39 శాతం మంది బీఆర్ఎస్కే ఓటేస్తామని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కొలువుదీరాలని ఆకాంక్షిస్తున్నారు.
అధికార బీఆర్ఎస్ 64 -70 సీట్లతో అధికారంలోకి వస్తుందని శ్రీఆత్మసాక్షి సర్వే ప్రకటించింది. ‘మూడ్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ఈ సంస్థ మూడు విడతల్లో సర్వే నిర్వహించి, ఫలితాలను వెల్లడించింది. జూలై, ఆగస్టు, అక్టోబర్ మాసాల్లో ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయసేకరణ జరిపింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 37 -43 సీట్లతో రెండోస్థానంలో ఉండగా, బీజేపీ 5-6, ఎంఐఎం 6 -7 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. మరో 6 స్థానాల్లో గట్టిపోటీ ఉంటుందని సంస్థ అంచనావేయగా, వీటిలో మూడు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉండే అవకాశమున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు బీఆర్ఎస్కు బలమైన అండగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ప్రసుత ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల జనం సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో 1.75 శాతం ఓటర్లు ఎటూ తేల్చుకోలేకపోగా, వీరిలో 80 శాతం ఎన్నికల్లో గల ఊపును బట్టి గెలిచే పార్టీవైపే ఉంటారని సంస్థ వర్గాలు అంచనావేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 77 సీట్లతో అధికారాన్ని దక్కించుకుంటుందని రాజ్‌నీతి సంస్థ సర్వేలో తేలింది. ఉచితాలంటూ, 6 గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ 29 సీట్లకే పరిమితం కానున్నది. బీజేపీ 6 స్థానాలతో సరిపెట్టుకోనుండగా బీఎస్పీ సహా ఇతరులు ఖాతా తెరిచే అవకాశం లేదని రాజ్‌నీతి సంస్థ సర్వేలో వెల్లడయ్యింది. సర్వే ఫలితాలను సోమవారం ఆ సంస్థ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లు, మునుగోడు మినహా 112 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. బీఆర్ఎస్ 43.35 శాతం ఓట్లను దక్కించుకోనుండగా, కాంగ్రెస్ 34 శాతం ఓట్లకే పరిమితంకానున్నదని సర్వేలో తేలింది.


