భూపాలపల్లి రూరల్, జూలై 14: సింగరేణి యజమాన్యం ఎల్లో, రెడ్ కార్డుల విధానాన్ని వెంటనే నిలిపేయాలని భూపాలపల్లి టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ చర్యల్లో భాగంగా సింగరేణి యాజమాన్యం ఎల్లో, రెడ్ కార్డుల విధానాన్ని అమలు చేసే పనిలో ఉందని తెలిపారు. ఈ విధానం వల్ల పని ప్రదేశాల్లో ఉద్యోగులు పొరపాటు చేస్తే స్థానికంగా ఉండే అధికారులకు మెయిల్ పంపుతారు. తద్వారా కార్పొరేట్ ఆఫీస్ నుంచి తప్పు చేసిన కార్మికుడికి నేరుగా ఎల్లో కార్డు జారీ అయినట్టు ఫోన్‌కు సందేశం వస్తుందని తెలిపారు.
ఎవరైనా కార్మికుడికి 3 సార్లు ఎల్లో కార్డు వస్తే అతడికి వెంటనే రెడ్ కార్డు జారీ చేస్తారని, రెడ్ కార్డు అందుకున్న కార్మికుడిపై యాజమాన్యం చార్జ్షీట్తోపాటు సస్పెన్షన్, ఇంక్రిమెంట్ కట్, డిస్మిస్ ఇలా ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవ్చని చెప్పారు. కార్మికుడికి రెడ్ కార్డు ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగిస్తే అతడి కుటుంబ పరిస్థితి ఏంటనేది యాజమాన్యం ఆలోచించాలని సూచించారు. ఇప్పటికే కొందరు కార్మికులకు ఎల్లో కార్డులు జారీ అయినట్టు సందేశాలు వచ్చాయని తెలిపారు. ఈ విషయం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి దృష్టికి వచ్చిన వెంటనే సీఎండీ, సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని, ఈ సర్క్యులర్‌ను నిలిపేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గౌరీపతిశర్మ, నరేశ్, మధు, రాంచందర్, రాజేందర్, సురేశ్, రవి పాల్గొన్నారు.