హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘స్థానికత’ వివాదంలో విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. పిటిషనర్లు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఇదే సమయంలో ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికతను నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-33ను సవాల్ చేస్తూ దాదాపు 135 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
విద్యార్థులకు అనుకూలంగా హైకోర్టు ఈ నెల 5న తీర్పు వెలువరించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనంతోపాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
తెలుగు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చదివి, తెలంగాణలో నీట్ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. దీంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏపీ విద్యార్థులు తెలంగాణలో నీట్‌కు హాజరుకావొచ్చని, కానీ తెలంగాణ విద్యార్థులకు ఏపీలో ఆ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో-33 తీసుకువచ్చిందని, దీనిని హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు. సెప్టెంబర్ చివరివారంలో నీట్ కౌన్సెలింగ్ మొదటి రౌండ్, అక్టోబర్ మొదటి వారంలో రెండో విడత కౌన్సెలింగ్ ఉన్నదని చెప్పారు.
విద్యార్థుల భవిష్యత్తు, కౌన్సెలింగ్‌కు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పిటిషనర్లు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. అయితే ఈ మినహాయింపు ఈ ఒక్కసారికి మాత్రమేనని స్పష్టం చేశారు. విద్యార్థుల తరఫు న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపిస్తూ.. నీట్ ఫలితాలకు వారం రోజుల ముందు తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిందన్నారు. ఆగస్టు 26న నీట్ ఫలితాలు రాగా, 19వ తేదిన జీవో 33 తెచ్చారని తెలిపారు.
రెండు, మూడు సంవత్సరాలు చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతను దూరం చేయకూడదని వాదించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసును వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది.