నవాబ్‌పేట, డిసెంబర్ 30 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్లపహాడ్‌కు చెందిన చాకలి అంకిత (18) పాలమూరు ఎన్టీఆర్ మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన చందుకుమార్ (20) జిల్లా కేంద్రంలోని వాసవీ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతుండగా.. ఇద్దరూ రెండేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో అంకిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలిసిన చందు మనస్తాపంతో అదే రోజు రాత్రి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం మృతి వార్త వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇద్దరి కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు.