Solar Subsidy | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లకు కేంద్రం ఇవ్వాల్సిన సబ్సిడీ నిలిచిపోయింది. ఏడాది దాటినా సబ్సిడీ విడుదల చేయకపోవటంతో రూ.30కోట్ల వరకు కేంద్రం బాకీపడింది. దీంతో సోలార్ ఇంటిగ్రేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూఫ్‌టాప్ సోలార్ స్కీం రెండో విడుతలో భాగంగా కేంద్రం మార్గదర్శకాలను సవరించింది. దీంతో వినియోగదారులకు కాకుండా, ప్లాంట్లు ఏర్పాటు చేసే సోలార్ ఇంటిగ్రేటర్లకు సబ్సిడీని అందించేలా మార్పులు చేసింది. వినియోగదారులు ఇన్స్టాలేషన్ ఖర్చులపై 60శాతం సబ్సిడీని పొందే అవకాశం కల్పించింది.
కాగా, రెండు కిలోవాట్ల వరకు రూ.30వేలు, మూడు కిలోవాట్ల వరకు రూ.78వేల సబ్సిడీని ఇంటిగ్రేటర్లకు ఇస్తారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు ఆమోదం పొందగానే కేంద్రం 30రోజుల్లోపు సబ్సిడీని విడుదల చేయాలి. కానీ, దరఖాస్తులను ఆమోదించి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు సబ్సిడీ విడుదల కాలేదు. కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్న ఆశతో ఇంటిగ్రేటర్లు సొంత డబ్బులు వెచ్చించి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సబ్సిడీ విడుదలయ్యేలా చూడాలని కేంద్రమంత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్లాంట్ల వ్యయం అమాంతం పెరుగుతున్నది. డొమెస్టిక్ కాంటెంట్ రిక్వైర్మెంట్ (డీసీఆర్) విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ విధానంలో ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వారు ఎవరి దగ్గర పడితే వారి దగ్గర సామగ్రిని కొనడానికి వీల్లేదు. సబ్సిడీ పొందాలనుకునే వారు కేవలం డీసీఆర్ విధానంలో ఎంప్యానెల్డ్ కంపెనీల (మేకిన్ ఇండియా) నుంచి మాత్రమే ఉపకరణాలను కొనుగోలు చేయాలన్న నిబంధన విధించారు. ఆ కంపెనీలు కొన్ని మాత్రమే ఉండగా, అవి కూడా గుజరాత్‌లోనే నెలకొన్నాయి. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ఐదు కిలోవాట్ల ప్లాంట్లకు రూ. 2.8లక్షలు అవుతుండగా, డీసీఆర్ తయారీ యూనిట్ల ద్వారా రూ. 3.2లక్షలు తీసుకుంటున్నారు. మార్కెట్ ధర కన్నా అధికం కావడంతో వినియోగదారులపై భారంపడుతున్నది.