హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర పోలీసుశాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడికక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమైంది. పోలీసుస్టేషన్ల పరిధిలో హోంగార్డుల నుంచి సీఐల వరకూ వరద ప్రభావిత జలాశయాల వద్ద పహారా కాస్తున్నారు.
జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు భద్రతా పరిస్థితిని సమీక్షించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో చొరవ తీసుకుంటున్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు స్థానికుల సహకారంతో పోలీసులు ఆహారం, మంచినీటి వసతి ఏర్పాటు చూశారు.
సూర్యాపేట జిల్లా కోదాడలోని శ్రీరంగాపురం వద్ద అర్ధరాత్రి 3 బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను పోలీసులు రక్షించారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోతుండగా హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ రాములు ధైర్యంగా వెళ్లి అతన్ని రక్షించారు. జిగిత్యాల జిల్లాలోని మల్యాల-పెగ్దపల్లి రోడ్డుకు అక్కడి పోలీసులు మరమ్మతులు చేశారు.
వరంగల్ జిల్లాలో సీపీ అంబర్ కిశోర్ఝా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఐపీఎస్ రోహిత్ రాజు, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రపవార్, ఖమ్మం జిల్లాలో సీపీ సునీల్ దత్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ బీ అనురాధ ఆయా జిల్లాల పరిధిలో వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. మహబూబ్బాద్, నాగర్కర్నూల్ జిల్లాల్లో పోలీసుల కృషిని ఎక్స్ వేదికగా డీజీపీ జితేందర్ కొనియాడారు.