హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ద్రవ్యవినిమయ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై గురువారం రాత్రి వరకు చర్చించిన అనంతరం సభ ఆమోదించింది. బిల్లుపై బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రాజ్‌ఠాకూర్ , ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తామని, ఆశ , అంగన్వాడి, మహిళా స్వయం సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్ఎంల వేతనాలు ప్రతి నెలా చెల్లించే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ర్టాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులు అత్యధికంగా ఉన్నా… రాష్ర్టాలకు మాత్రం అతి తక్కువగా నిధులు వస్తున్నాయని, దీనిపై కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకవెళ్లేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.