Telangana | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులను నిధుల సమస్య వెంటాడుతున్నది. ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో వర్షాకాలంలో పాడైన రోడ్లకే ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. అంతేకాకుండా గత ఏడాదిన్నరగా దాదాపు రూ.1,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఆర్అండ్బీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ, ప్రభుత్వంపై విశ్వాసంలేక ఆ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు విముఖత చూపుతున్నారు. హ్యామ్ విధానంలో రూ.28 వేల కోట్లతో 17 వేల కి.మీ. గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం మొదటి దశలో 5,189 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అధికారులు ఇప్పటికే ఆ రోడ్ల ఎంపికను పూర్తిచేశారు.
కన్సల్టెంట్ల ఆధ్వర్యంలో అంచనా వ్యయం సహా సమగ్ర నివేదికను సిద్ధంచేసి సాధ్యమైనంత త్వరగా టెండర్లను పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, హ్యామ్ విధానంలో రోడ్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే ముందు వాటికి మరమ్మతులు పూర్తిచేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోడ్డు అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రైవేటు ఏజెన్సీ వెచ్చిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన రోడ్ల మరమ్మతులకు ఆర్అండ్బీ శాఖ టెండర్లు పిలిచింది. దాదాపు రూ.300 కోట్ల విలువైన ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.160 కోట్ల పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పటికే రోడ్ల మరమ్మతులకు సంబంధించిన దాదాపు రూ.1,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
హ్యామ్ విధానంలో కాంట్రాక్టర్లు 60% నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 40% నిధులను ప్రభుత్వం దశలవారీగా అందిస్తుంది. దీంతో అసలు ప్రభుత్వ వాటా నిధులు వస్తాయా? అని సందేహిస్తున్న కాంట్రాక్టర్లకు తాము ఖర్చుచేసే 60% నిధులను ఎలా రాబట్టుకోవాలో తెలియడం లేదు. టోల్ ట్యాక్స్ వసూలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ అందుకు ప్రజలతోపాటు విపక్షాలు ఒప్పుకుంటాయా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రజలపై టోల్ చార్జీల భారం మోపకుండా కాంట్రాక్టర్లు వెచ్చించే 60% నిధులను సైతం ప్రభుత్వమే దశలవారీగా చెల్లిస్తుందని ఇటీవల ఆర్అండ్బీ శాఖ మంత్రి స్పష్టత ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వెనుకాడుతున్నారు. తీరా పనులు మొదలుపెట్టాక ప్రభుత్వం చెల్లించాల్సిన 40% నిధులను మంజూరు చేయకుంటే పనులు మధ్యలో నిలిచిపోవడంతోపాటు తాము ఖర్చు చేసిన 60% నిధులు కూడా జామ్ అవుతాయేమోనని అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆర్అండ్బీ శాఖ ఇటీవల కొందరు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించింది. కానీ, ఆ భేటీలో కాంట్రాక్టర్లు లేవనెత్తిన సందేహాలకు అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
రాష్ట్రంలో రోడ్లు, భవనాల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.5,907 కోట్లు కేటాయించింది. హ్యామ్ విధానంలో తొలి విడతగా 5,189 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినప్పటకీ బడ్జెట్లో కేటాయింపులు స్వల్పంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు అంటున్నారు. రోడ్ల అభివృద్ధి బాధ్యతను పూర్తిగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులిపేసుకునేలా ప్రభుత్వం ఆలోచన ఉన్నదని చెప్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 2,553 కి.మీ. రోడ్లతోపాటు 902 హైలెవల్ బ్రిడ్జీలు, 391 కల్వర్టులు, 166 బ్రిడ్జీలకు నష్టం వాటిల్లినట్టు గుర్తించిన అధికారులు.. వాటి శాశ్వత మరమ్మతులకు రూ.2,462 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ, ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. దీంతో కాంట్రాక్టర్ల విముఖత వల్ల ఆ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా మారాయి.