హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : ఫార్మసీ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 550కోట్లు బకాయిపడ్డది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద సర్కారు ఈ కాలేజీలకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాలేజీలను నడపడం తమ వల్ల కావడంలేదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. రాష్ట్రంలో 113 ప్రైవేట్ ఫార్మసీ కాలేజీలున్నాయి. 70వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో ఏడు ప్రభుత్వ ఫార్మసీ కాలేజీలుండగా వీటిల్లో 1,500 మంది విద్యార్థులున్నారు.
55వేల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలోనే సీట్లు పొందారు. ఏటా రూ.200 కోట్ల వరకు రీయింబర్స్మెంట్ కింద సర్కారు చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించకపోవడంతో రూ. 550కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కాలేజీల యాజమాన్యాలంటున్నాయి.
ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రెండు, మూడు విడతల్లో విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇంతవరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫార్మసీ కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఫార్మసీ కళాశాలల యాజమాన్యాల సంఘం డిమాండ్ చేసింది. బకాయిలు పేరుకుపోవడంతో జీతాలు చెల్లించలేకపోతున్నామని, నాణ్యతపై ప్రభావం చూపుతున్నదని సంఘం నేతలు కే రాందాస్, పుల్లా రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తంచేశారు.