హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మరో రూ.3000 కోట్లు అప్పు తీసుకోనున్నది. ఈ నెల 6వ తేదీనే రూ.3000 కోట్ల రుణం తీసుకున్న రేవంత్రెడ్డి సర్కార్.. మరోసారి ఈ నెల 13న మళ్లీ రూ.3000 కోట్ల అప్పు తీసుకొనేందుకు చర్యలు చేపట్టింది. వెయ్యి కోట్ల విలువైన మూడు బాండ్లను ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది. మూడు వేల కోట్ల విలువైన బాండ్లను వేర్వేరుగా 11 ఏండ్లు, 14 ఏండ్లు, 21 సంవత్సరాల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ ఆర్బీఐకి జారీచేసింది. వీటిని ఈ నెల 13న వేలం వేయనున్నట్టు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది.
అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది. ప్రతి నెల రూ.5 నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్లను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నది. ఈ ఏడాది జూలై 24 నాటికే రూ.35,118 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో రేవంత్రెడ్డి సర్కారు వెల్లడించింది. ఈ ఏడాది రూ.62,012 కోట్లు రుణ సమీకరణ చేయనున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించింది.
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర అప్పు పద్దు రూ.10 వేల కోట్లు ఎక్కువకావడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.