హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆచరించిన దానిని దేశం అనుసరిస్తున్నదని మరోసారి రుజువైంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రెండున్నరేండ్ల క్రితమే తెలంగాణ ప్రారంభించిన ‘సీడ్ ట్రేసబిలిటీ సిస్టమ్’ను త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించడం ఇందుకు నిదర్శనం. న్యూఢిల్లీలో శనివారం జరిగిన జాతీయ విత్తన సంఘం సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండాలంటే ‘సీడ్ ట్రేసబిలిటీ సిస్టమ్’ను దేశవ్యాప్తంగా ప్రారంభించాల్సిన అవసరమున్నదని ప్రకటించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను పరిశీలిస్తే.. 2021 ఏప్రిల్ 2న దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించి.. అమలు చేస్తున్న ‘సీడ్ ట్రేసబిలిలిటీ’ సత్ఫలితాలిస్తున్నదని, ఇదే దేశమంతటికీ అనుసరణీయమని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ విత్తన పాలసీని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించడం రాష్ర్టానికి గర్వకారణమని తెలంగాణ విత్తన సంస్థ ఎండీ డాక్టర్ కే కేశవులు తెలిపారు.