హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగా ణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లో కమ్మ, వెలమ సంఘాల భవనాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ఆ రెండు కులాలకే కాకుండా ఇతర కులాలకు కూడా ప్రభుత్వం భూములు కేటాయించిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. రెండు కులాలకు భూ ములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది. శారదాపీఠం, జీయర్వేదిక్ అకాడమీలకు ప్రభుత్వం హైదరాబాద్‌లో భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన వీరాచారి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా అదే ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. సినీ దర్శకుడు ఎన్ శంకర్‌కు భూమి కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిల్ విచారణను జూలై 5కి వాయిదా వేసింది.
రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో రాజా బహుదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రభుత్వం 2018లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే 2023లో పిటిషన్ దాఖలు చేయడం ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. తీవ్ర ఆలస్యంగా పిల్ వేయడానికి కారణాలు చెప్పాలని సామాజిక కార్యకర్త కే కోటేశ్వరరావును ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.