మహబూబాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ జై తెలంగాణ.. జై బాబు.. జై భీమ్.. జై జగన్.. జై కాంగ్రెస్.. అంటూ నినదించారు. దీంతో వేదిక పైన ఉన్న కలెక్టర్, ఎస్పీ తదితరులు అవాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా మానుకోట జిల్లాకు ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.
స్టేజిపైకి వచ్చి పథకాల అమలుపై ప్రసంగం పూర్తయ్యాక జై తెలంగాణ.. జై బాపు.. జై భీమ్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జై జగన్ అనడంతో వేదిక పైన ఉన్న వారితో పాటు ఉద్యోగులు, కళాకారులు, ప్రజలు, పాత్రికేయులు ఒకసారిగా అవాకయ్యారు. జై జగన్ అనడం ఏమిటని గుసగుసలాడుకున్నారు.