హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 19 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. కొత్తగా ఓటు హక్కు కోసం 10.27 లక్షలు, చిరునామా మార్పునకు 5.58 లక్షలు, ఓట్ల తొలగింపునకు ఇప్పటి వరకు 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 19 వరకు ఓటరు జాబితా దరఖాస్తు గడువు ఉండగా, అక్టోబరు 4న తుది జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుతం రూపొందుతున్న ఓటరు జాబితా ప్రకారమే సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని అంచనా వేస్తున్నారు. తుది గడువు ముగిసేలోగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని విశ్లేషిస్తున్నారు. గతంలో చిరునామా మార్పునకు తక్కువగా దరఖాస్తులు వచ్చేవి. ఈ సారి వాటి సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం రెసిడెండ్ వెల్ఫేర్స్ అసోసియేషన్స్ బూత్ లెవల్ ఆఫీసర్లను పంపించి ప్రత్యేకంగా ఓటరు జాబితా సవరణను చేయిస్తున్నారు. ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుందని గుర్తించారు. బూత్ లెవల్ ఆఫీసర్ అందరి వివరాలు, ఫోన్ నెంబర్లను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీరి గురించి విస్తృత ప్రచారం చేయడంతో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని అంచనా వేశారు.
రాష్ట్రంలో మహిళా ఓటరు నమోదులోనూ ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. మహిళా జనాభా 1000 మందికి 993 ఉండగా, ఓటర్ల నమోదు మాత్రం 1000కి 982 ఉన్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మహిళా ఓటర్ల సంఖ్య పట్టణాల్లో తక్కువగా ఉందని నిర్ధారించుకొని, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా ఏ నియోజకవర్గాల్లో తక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లు ఉన్నారని అంచనా వేసి, ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రస్తుతం 1000కి 982కు చేరిందని, ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందని, మహిళా సగటు జనాతో సమానంగా ఉండేలా ఇంకా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించింది.
ఓటరు నమోదుతో పాటుగా గతంలో ఒకే రకమైన ఫొటోతో ఉన్న ఓటర్లను అధికారులు తొలగించారు. ఈ సంఖ్య దాదాపుగా 10 లక్షలకు పైగా ఉంది. ఇందులో ఎవరైనా అర్హులైన వారి ఓట్లు తీసివేశారో అనే కోణంలో కూడా మరో సారి పరిశీలిస్తున్నారు. దీని ద్వారా ఓటింగ్ రోజున ఫిర్యాదులు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకే ఫొటో, ఒకే పేరు, ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి వాటిలో ఒకటే పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.