హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం మేరకు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటుచేస్తారో చెప్పకుండా కేంద్రం మౌనం దా ల్చింది. తెలంగాణ, ఏపీతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై పలువురు ఎంపీలు లోక్సభలో సోమవారం ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వర్సిటీ ఏర్పాటు కోసం ఢిల్లీ, యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్ నుంచి తమకు ప్రతిపాదనలు అందలేదని తెలిపారు.
తెలంగాణ, ఏపీలో గిరిజన వర్సిటీలు నెలకొల్పాలని విభజన చట్టంలో ఉన్నదని అంగీకరించారు. ఏపీలో 2019లోనే ఏర్పాటు చేశామని, అక్కడ 340 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాలని ఒప్పుకుంటూనే.. ఎప్పుడు మంజూరు చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో 360 ఎకరాలతోపాటు తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు వైటీసీ భవనాన్ని కేటాయించింది. అయినా కేంద్రం యూనివర్సిటీని మంజూరు చేయకుండా రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్నది.