హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మూడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కోసం రాష్ట్ర అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కుమ్రంభీం-ఆసిఫాబాద్, భూపాలపల్లి, భ దాద్రి-కొత్తగూడెం జిలాల్లో ఏర్పాటుచేసే అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యా వసతుల కల్పనలో భాగంగా ఈ మూడు జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.
తాజాగా జోగులాంబ-గద్వాల జిల్లాలోనూ మ రో కేవీని ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్ర తిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇదిలా ఉండగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నది. నిరుడు దేశవ్యాప్తంగా 87 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదిస్తే, ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదు.