హైదరాబాద్,మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కల్తీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ తెలిపింది. రైతులకు నాణ్యమైన విత్తనం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ సమస్యలపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన వ్యవసాయ కమిషన్ సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో రైతు కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 1966లో కేంద్రం చేసిన విత్తన చట్టం, 2007 పత్తి విత్తన చట్టాల్లో లోపాలున్నాయని 2004 నుంచి చర్చ జరుగుతున్నదని తెలిపారు. కాబట్టి రాష్ర్టానికి కొత్త విత్తన చట్టం అవసరమని పేర్కొన్నారు. ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట నిజామాబాద్ ప్రాంతాల్లో నకిలీ మొక్కజొన్న, వరి, పత్తి విత్తనాల వల్ల వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులు రోడ్లెక్కి ఆందోళన చేశారు.
రైతుల నుంచి వచ్చిన ఒత్తిడితో ఆ ప్రాంతాల్లో పర్యటించిన రైతు కమిషన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రతినిధులు, అధికారులు నకిలీ విత్తనాల వల్లే రైతులు నష్టపోయారని గుర్తించారు. విత్తనం పండించుకోడానికి తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని, అందుకే మల్టీనేషనల్ కంపెనీలు అన్ని రకాల విత్తనాలను ఇకడ తయారుచేస్తున్నాయని కమిషన్ సభ్యులు గుర్తించారు. నకిలీ విత్తనాల బారినపడి రైతులు మోసపోయిన ఘటన ఇటీవల ములుగులో వెలుగుచూసిందని రైతు కమిషన్ సభ్యులు తెలిపారు. రైతు కమిషన్ ములుగులో పర్యటించి కమిటీ వేసి నివేదిక తెప్పించినట్టు పేర్కొన్నారు. మొక్కజొన్న కంకి తింటే పశువులు చనిపోయాయని కమిషన్ పేర్కొన్నది. రైతులు, కూలీలు తిని అనారోగ్యం పాలయ్యారని, ఒకరిద్దరు చనిపోయారని తెలిపారు. సింజెంటా కంపెనీ మోసాలు చాలా ఉన్నాయని, మారెట్ ఫీజు కూడా కట్టకుండా మినహాయింపు తెచ్చుకున్నారని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు.
పసుపు పంటకు నిజామాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నదని, అందుకనే కేంద్ర ప్రభుత్వం అక్కడ పసుపుబోర్డు ఏర్పాటు చేసిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. అయినప్పటికీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకడ పండే పసుపులో కురుకుమిన్ శాతం తకువగా ఉన్నదని, అది ఎకువగా ఉండే విత్తనం అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. భూమిలో నుంచి పసుపు పీకడం, ఉడకబెట్టడం, పాలిష్ చేయడంలో యంత్రపరికరాలు అవసరమని తెలిపారు. వచ్చే సీజన్ నాటికైనా కేంద్రం ఆధునిక యంత్రాలు అందించే ప్రయత్నం చేయాలని కోరారు. కురుకుమిన్ శాతం ఎకువగా ఉండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖకు కూడా సూచించినట్టు కోదండరెడ్డి తెలిపారు. కల్తీ విత్తనం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి తెలిపారు. ములుగులో పర్యటించాక విత్తన చట్టం అవసరాన్ని గుర్తించినట్టు చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందడం లేదని వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. వానకాలానికి ముందే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసి రైతులు నకిలీ విత్తనాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకున్నది. నకిలీ విత్తనాలు విక్రయిస్తూ ఎవరైనా దొరికితే పీడీయాక్ట్ నమోదు చేసి జైళ్లకు పంపింది. దీంతో బీఆర్ఎస్ హయాంలో రైతులు హాయిగా పంటలు పడించుకున్నారు. ఎక్కడా నకిలీ అన్నమాటే వినిపించలేదు. ఈ విషయాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఎడాపెడా విత్తనాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుని రైతుల పొట్ట కొడుతున్నారు. స్వయంగా వ్యవసాయ కమిషనే ఈ విషయం చెప్పడం అందరినీ విస్మయపరుస్తున్నది. నకిలీ వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆందోళన
వ్యక్తంచేస్తున్నారు.