హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆయా చోట్ల ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాలు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే మార్చి 29వ తేదీతో ముగియనున్నది. ఆయా స్థానాల్లో ఎన్నికల కోసం ఈనెల 30 నుంచి ఓటరు నమోదు ప్రారంభంకానున్నది. ఆయా స్థానాల నుంచి ప్రస్తుతం టీ జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
దీని కోసం డిసెంబర్ నెలాఖరు కల్లా ఓటరు జాబితాను ప్రకటించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదుకు నవంబర్ 1 కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందే. గతంలో ఓటు ఉన్నా మరోసారి ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. 2019లో ఆయా స్థానాలకు ఎన్నికలు జరగ్గా అప్పుడు తక్కువగా ఓట్లు నమోదయ్యాయి. 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి కేవలం 1.96 లక్షల మంది పట్టభద్రులే ఓటర్లు నమోదు చేసుకున్నారు. అదే ఏడాది కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 23 వేల మంది, నల్లగొండ టీచర్ నియోజకవర్గంలో 21 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి మూడు నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.