హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రెండు గ్రామాల (రాంపూర్, మైసంపేట) పునరావాసం ఒక మాడల్‌గా ఉండాలని, మిగతా శాఖలతో సమన్వయం చేసుకొంటూ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపు పురోగతి, హరితవనాల్లో 100 శాతం మొకలు నాటడం, అర్బన్ పారుల అభివృద్ధిపై శుక్రవారం ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల ఆవాసాలను మరింత అభివృద్ధి చేయాలని, అడవుల్లో జనసంచారం, పెంపుడు జంతువుల ద్వారా తలెత్తే సమస్యలను తగ్గించటమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. అన్ని హరితవనాల్లో వందశాతం పచ్చదనం పెంచేలా మొకలు నాటాలని అన్నారు. 1.80 కోట్ల మొకలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు కోటి వరకు నాటినట్టు అధికారులు వివరించారు. అర్బన్ ఫారెస్ట్ పారుల ఏర్పాటుపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని, మొత్తం 109 పారులకు 55 చోట్ల పూర్తయ్యాయని, 54 వివిధ దశల్లో ఉన్నాయని శాంతికుమారి తెలిపారు. హరితనిధి ద్వారా అభివృద్ధి చేస్తున్న సెంట్రల్ నర్సరీల పురోగతిపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో అదనపు పీసీసీఎఫ్ వినయ్‌కుమార్, డీసీఎఫ్ శాంతారాం, ఓఎస్డీ శంకరన్, కన్సల్టెంట్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.