జగిత్యాల, నవంబర్ 16, (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. జగిత్యాలలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగాల్ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై హైకోర్టు తీర్పు విషయాన్ని ప్రస్తావిస్తూ .. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం స్పీకర్ పరిధిలో ఉందని చెప్పారు.
బెంగాల్ రాష్ట్రంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదన్న ఫిర్యాదు మేరకు న్యాయస్థానం స్పందించిందని చెప్పారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని అనుకోవడం లేదని తెలిపారు. పార్టీ ఫిరాయింపు రాజ్యాంగంలో పొందుపర్చబడిన అంశమని, అలాంటి ఫిరాయింపు అంశంపై స్పీకర్ నిబంధనలకు అనుగుణంగా వ్యహరిస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు.